గడచిన నాలుగేళ్లలో టిడిపి ప్రభుత్వం చేసిన అప్పులు సుమారుగా రూ 1.20 లక్షల కోట్లు ఏమయ్యాయో లెక్కలు చెప్పాలని పిఎసి ఛైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల పబ్లిక్‌ అకౌంట్స్‌ (పిఎసి) కమిటీ జరిపిన చర్చలో ఈ అప్పుల విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేసినా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఒక్కటీ పూర్తవలేదని పిఎసి ఛైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన అప్పులు సుమారు రూ 1.20 లక్షల కోట్లు ఏమయ్యాయనే ప్రశ్న క్రమంగా బలం పుంజుకుంటోంది. పిఎసి కమిటీ చర్చలో వెలుగు చూసిన ఈ అప్పుల వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. వైసిపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిఎసి ఛైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి టిడిపిపై విమర్శల వర్షం కురిపించారు.

నాలుగేళ్లలో 1.20 లక్షల కోట్లు టిడిపి ప్రభుత్వం ఏం చేసిందనే విషయంపై ఆర్థిక వేత్తలు విస్తు పోతున్నారని రాజేంద్రనాధ్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పట్టిసీమ, తాత్కాలిక సచివాలయం మాత్రమే పూర్తయ్యాయి…జల వనరులశాఖలో పలు ప్రాజెక్టుల పనులు మాత్రమే అవుతున్నాయి…వీటిల్లో కూడా ఇపిసి కింద కేటాయించిన ప్రాజెక్టులకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత అంచనాలు పెంచారు…ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేసినా చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఒక్కటీ రాష్ట్రంలో లేదని పిఎసి ఛైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టిసీమ, తాత్కాలిక సచివాలయం మినహా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏవో ప్రభుత్వం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ALSO READ:  Why 'Elections' Becomes An Environmental Nightmare?

అన్నీ తాత్కాలికమే…అన్నీ అప్పులే…
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రూ.1600 కోట్లు ఖర్చుపెట్టి పూర్తి చేసిన పట్టిసీమ ప్రాజెక్టు ఎత్తేస్తారని, అలాగే శాశ్వత ప్రభుత్వ కార్యాలయాలు పూర్తయితే రూ.700 కోట్లతో నిర్మించిన తాత్కాలిక సెక్రటేరియట్‌ ఎత్తేస్తారని, ఇవన్నీ తెలిసికూడా కనీస ఆలోచన లేకుండా వందల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాకుండానే రాష్ట్రంలో రెవెన్యూ లోటు పెంచారంటున్నారు. 2014లో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చేప్పటికి రూ. 97 వేల కోట్ల అప్పులున్నాయి. 2014 నుండి ఇప్పటి వరకూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరో రూ.1.20 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇందులో రూ.68 వేల కోట్లు వడ్డీతో కూడినవి, మిగిలినవి వడ్డీలేనివి. వీటిని కూడా వేర్వేరు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ బ్యాంకుల నుండి తీసుకొచ్చారు. దీంతో మొత్తం మీద ఇప్పటికే ఎపి అప్పులు రూ.2.16 లక్షల కోట్లు చేరినట్లు వెల్లడించారు.

ALSO READ:  Is KCR's Pet Project 'Dalit Bandhu Scheme' On Income Tax Radar? 

లోటు బడ్జెట్ తో సహా…అన్నీ సందేహాలే…
దీనిపై పిఎసిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వడ్డీలేని అప్పులు తీసుకొచ్చామని, వీటి వల్ల ఇబ్బంది ఏమిటని ప్రభుత్వ ప్రతినిధులు ఎదురు ప్రశ్నిస్తున్నారన్నారు. ఈ విషయంపై కూడా పిఎసిలో చర్చ సాగింది. రాష్ట్రంలో చెప్పుకోదగిన ప్రాజెక్టు ఒక్కటీ లేకపోయిన్పటికీ ఇన్ని లక్షల కోట్లు అప్పులు, ఖర్చులు దేనికి చేశారనే ప్రశ్న ఉత్పన్నం అవుతోందన్నారు. మరోవైపు ఈ అప్పులు కాకుండా రూ.70 వేల కోట్లు రెవెన్యూ లోటు చూపిస్తుండటం కూడా అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్ర విభజన సమయానికి కాగ్‌ నివేదికలో రూ.7000 కోట్ల లోటు ఉంటుందని చెప్పిందని, కేంద్రమైతే రూ.4000 కోట్లు మాత్రమే ఉంటుందని చెప్పిదని, అందుకే కేంద్రం ఆ మేరకు నిధులు విడుదల చేసి చేతులు దులుపుకొందని నిపుణులు చెబుతున్నారు.

ALSO READ:  'Cosmetic Solutions In GHMC Will Not work For Urban Sewerage'

రాష్ట్రంలో ఆదాయాన్ని తెచ్చే ఒక్కటంటే ఒక్క ఆస్తి కూడా పెంచకుండా అప్పుల మాత్రం పెంచేశారని, తెచ్చిన అప్పులు ఏ మయ్యాయనేది ప్రశ్నార్థకమంటున్నారు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. పోలవరానికి ఖర్చు చేసినా వాటిని కేంద్రం నుండి రీయింబర్స్‌ చేసుకుంటున్నారని, అటువంటప్పుడు అది అప్పులో లెక్క కూడా కాదంటున్నారు. అలాగే నిధులు విషయంలో ప్రభుత్వం నంబరు 22 జీవోతో ప్రాజెక్టుల అంచనాలు పెంచిందంటున్నారు…ఇపిసి ప్రాజెక్టులు కేటాయించేటప్పుడే అంచనాలుంటాయని, అటువంటప్పుడు వందల కోట్లు అదనంగా ఎలా కేటాయించారని పిఎసి సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు మొత్తం అప్పులు రూ.2.16 లక్షల కోట్లకు చేరుకోగా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా తరువాత వాటిని చెల్లించాల్సింది ప్రజలే. అంతిమంగా వారిపైనే భారం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పులు చేసే సమయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆలోచన లేకుండా చేసిన అప్పుల వల్ల నిధులు దుబారా అవుతాయని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. #KhabarLive