తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అందులో కాంగ్రెస్ పార్టీకి బలమైన బలగం ఉన్న పాలమూరు మరింత వేడెక్కింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల్లో ఉన్న కీలకమైన నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తుండగా.. వారి రాకను అడ్డుకునే వారు పక్క పార్టీల వైపు జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

దీంతో కాంగ్రెస్ రాజకీయాలు రసవ్తతరంగా మారాయి. మరి పాలమూరులో నాగం జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఈ రెండు టిడిపి శక్తులు కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ కీలక నాయకురాలు గద్వాల డికె అరుణ భవిష్యత్తు ఏంటి? ఆమె పయణమెటు? అన్న అంశాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇంతకూ పాలమూరులో ఏం జరుగుతోంది.

ఎలాగైనా 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అందుకోసం ఇతర పార్టీల్లో బలమైన నేతలుగా ముద్రపడ్డ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తెలంగాణలో కేసిఆర్ కుటుంబ పాలన అంతం చేయడమే లక్ష్యంగా ఉన్న వారంతా కాంగ్రెస్ గూటికి మెల్లమెల్లగా చేరిపోతున్నారు. ఆ క్రమంలో పాలమూరు జిల్లాలో బలమైన నేతగా ముద్ర పడ్డ రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కేసిఆర్ ను గద్దె దింపడమే తన లక్ష్యమని ప్రకటించారు.

ALSO READ:  Why Telangana CM KCR Announcement On Lockdown Extension Keeps AP CM Jagan Reddy On Tenterhooks?

ఇక గతంలో టిడిపిలో చక్రం తిప్పిన నేతగా ఉన్న మరో పాలమూరు నేత నాగం జనార్దన్ రెడ్డి ఎన్నికల ముందు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఆయన బిజెపిలో ఇమడలేకపోతున్నారు. స్థానిక బిజెపి నేతలు టిఆర్ఎస్ తో దోస్తాన్ చేస్తున్నారన్నది నాగం భావన. టిఆర్ఎస్ పై పోరాటం చేసి ప్రత్యామ్నాయ పార్టీగా నిలవాలన్న ఉద్దేశం నాగం జనార్దన్ రెడ్డిలో కనిపిస్తోంది. కానీ ఆయన దూకుడు తగ్గట్టుగా బిజెపి వ్యవహరించలేకపోతున్నదని ఆయన గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక ఆయన కూడా కాంగ్రెస్ లో చేరడం ఖాయమన్న ప్రచారం బలంగా సాగుతోంది.

నాగం రాకను తాను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రకటించారు. నాగంతో పాటు టిడిపిలో తన ప్రత్యర్థిగా ఉన్న రావుల చంద్రశేఖరరెడ్డి వచ్చినా తనకు సమ్మతమేనని, అవసరమైతే రావులకు తన సీటు త్యాగం చేస్తానని కూడా ప్రకటించారు. కానీ నాగం రాకను పాలమూరు జిల్లాలో ఒక బలమైన వర్గం మాత్రం వ్యతిరేకిస్తోంది. నాగం కు వ్యతిరేకంగా ఆ వర్గం పావులు కదుపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో నాగం కాంగ్రెస్ కు రాకుండా అడ్డుకట్ట వేయడానికి సర్వశక్తలూ ఒడ్డుతోంది. ఆ వర్గం వివరాలేంటో కింద చదవండి.

ALSO READ:  Who Gives And Who Lives? India’s Unorganized 'Organ Transplant System' Continues To Favour The Rich People

గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడాన్ని డికె అరుణ వర్గం బలంగా వ్యతిరేకించింది. కానీ అధిష్టానం మాత్రం రేవంత్ ను తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఇప్పుడు నాగం విషయంలోనూ అదే జరుగుతోంది. నాగం రాకను డికె అరుణ వర్గం వ్యతిరేకిస్తోంది. అరుణ వర్గంలో ఉన్న నాగం చిరకాల ప్రత్యర్థి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి బహిరంగ ప్రకటనలు గుప్పిస్తున్నారు. నాగం వస్తే.. తమ దారి తాము చూసుకుంటామని ఆయన హెచ్చరించారు.

అధిష్టానం మాత్రం నాగం జనార్దన్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటున్నామని, అందరూ కలిసి పనిచేసుకోవాలని ఇప్పటికే పాలమూరు నేతలకు తేల్చి చెప్పింది. నాగం రాకను అడ్డుకునేందుకు ఢిల్లీ వెళ్లిన డికె వర్గానికి చేదుఅనుభవం ఎదురైంది ఈ పరిస్థితుల్లో నాగం రాకను జీర్ణించుకోలేని నేతలంతా డికె అరుణ వర్గం గా మారిపోయినట్లు చెబుతున్నారు. నాగం

పాలమూరు జిల్లాలో అత్యంత బలమైన నేతగా ఉన్న జైపాల్ రెడ్డితో ఇప్పుడు డికె అరుణ వర్గం ఢీ అంటే ఢీ అంటోంది. నాగం కానీ, రేవంత్ కానీ, వీళ్లంతా జైపాల్ వర్గం వారేనని డికె వర్గం భావన. జైపాల్ తన మనుషులందరినీ తెచ్చుకుని తమకు చెక్ పెడతారేమోన్న ఆందోళన డికె అరుణ వర్గంలో ఉన్నట్లు చెబుతున్నారు. నాగం వస్తే తమకు పాలమూరు రాజకీయాల్లో ప్రాధాన్యత ఉండదేమోనన్న ఆందోళనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జైపాల్ రెడ్డి మీద కూడా కూచుకుళ్ల విరుచుకుపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగం జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకున్నా..

ALSO READ:  The Dying Art Of 'Zari' Artisans In Hyderabad, Faces Tough Ordeal, Near To Extinction

తమ కంటే జూనియర్ లీడర్ గా ఉన్న రేవంత్ రెడ్డికి పిసిసిలో కీలక బాధ్యతలేవైనా అప్పగించినా డికె వర్గం పార్టీ నుంచి నిష్క్రమించే చాన్స్ ఉందని పాలమూరు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన యువ నేత ఒకరు ఏషియానెట్ తో వెల్లడించారు. ఈ రెండు కారణాలతోపాటు ఒకవేళ రేవంత్ కు పాదయాత్ర చేసేందుకు అనుమతించి అరుణకు అనుమతి రాకపోయినా పార్టీ మారవచ్చని ఆ యువనేత వెల్లడించారు.

ఇప్పుడున్న సమాచారం ప్రకారం డికె అరుణ వర్గంలో యువ నేతలు ఎక్కువ మంది ఉన్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డికె అరుణతోపాటు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కొల్లాపూర్ విష్ణు వర్ధన్ రెడ్డి, దేవరకద్ర పవన్ కుమార్ రెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, ఒబేదుల్లా కోత్వాల్ లాంటి నేతలంతా ఆమెతో పాటే నడిచే అవకాశాలున్నట్లు టాక్ నడుస్తోంది. #KhabarLive