చింతపండుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు మద్దతు ధర ప్రకటించింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఒక కిలోకు రూ.18లే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ధర ఏ మాత్రమూ గిట్టుబాటు కాదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో జనవరి నుంచే చింతపండు సీజన్‌ ప్రారంభమైంది. ఈ ఏడాది ఎనిమిది వేల మెట్రిక్‌ టన్నుల వరకూ చింతపండు ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు.

గిరిజన ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రయివేటు వ్యాపారుల దోపిడీని అరికట్టే ఉద్దేశంతో ప్రభుత్వం గిరిజన సహకార సంస్థను (జిసిసిని) ఏర్పాటు చేసింది. గిరిజన ఉత్పత్తుల ధరను నిర్ణయించే అధికారం జిసిసికి ఇవ్వడం లేదు. ప్రభుత్వమే నేరుగా ధరను ప్రకటిస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో చింతపండు ధర రూ.90 నుంచి రూ.100 వరకూ ఉంది.

ALSO READ:  20 Ways To Sell Your Product Faster

ప్రభుత్వం ప్రకటించిన ధర ఇందులో ఐదో వంతు కూడా లేకపోవడంతో గిరిజనులు చింతపండును జిసిసికి విక్రయించేందుకు ఇష్టపడటం లేదు. అంతకంటే ఎక్కువ ధర ఇస్తున్న ప్రయివేట్‌ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. కొందరు వ్యాపారులు కేజీకి ప్రస్తుతం రూ.35 వరకూ ఇస్తున్నా తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు.

గతేడాది కేవలం 120 క్వింటాళ్ల చింతపండును మాత్రమే జిసిసి కొనుగోలు చేయగలిగింది. కొన్ని బ్రాంచుల్లో ఒక్క కేజీ కూడా కొనలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొననుంది. #KhabarLive