ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకొని.. హ్యాపీ బర్త్‌డే డ్యాడ్ అంటూ మినిస్టర్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. వీరాధి వీరుడు అతడు, విజయానికి బావుట అతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు.. అంటూ ఓ చిన్న కవితను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, కార్యక్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉద్యమ నాయకుడిపై గాయకుడు, రచయిత గోరేటి వెంకన్న సాహిత్యంలో, బందూక్ సినిమా దర్శకుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ పాటను రూపొందించారు. వీరాధి వీరుడు అతడు అంటూ సాగిన పాటను విడుదల చేశారు. (Song Video: https://www.facebook.com/ntdailyonline/videos/1947124008706186/)

బంగారు తెలంగాణ రథసారథి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అభిమానులు, గులాబీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు. నేడు గ్రేటర్ వ్యాప్తంగా బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మంత్రుల మొదలు కార్యకర్తలు, అభిమానులు, పార్టీశ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీ కేక్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రక్తదాన శిబిరాలు, భారీ కేక్ కటింగ్‌లు, అన్నదానాలు చేయనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో జలవిహార్‌లో భారీ కేక్‌కటింగ్‌తో పాటు అనేక సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు ఉంటాయి.

ALSO READ:  The Mindful ‘MS Maqtha Art Festival’ Of Hyderabad - The Vivid Modern Art Experience

ఉదయం 10.30 గంటలకు జలవిహార్‌లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎంపీ కవిత, టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్ తో పాటు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రారంభిస్తారు. 11 గంటలకు దివ్యాంగులకు వీల్‌ఛైర్స్, అంధులకు చేతికర్రలు, మహిళలకు చీరెల పంపిణీ చేస్తారు. 11.30 గంటలకు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావుగౌడ్, బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావుతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌రావు భారీకేక్‌ను కట్ చేస్తారు. అలాగే గ్రేటర్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు మల్కాజ్‌గిరి, అల్వాల్‌లో బర్త్ డే వేడుకలు ఘనంగా జరపనున్నారు. అల్వాల్ వెంకటపురంలో రక్తదాన శిబిరం, మల్కాజ్‌గిరి ఇందిరాగాంధీ విగ్రహం వద్ద భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో మైనంపల్లి పాల్గొననున్నారు. నగరంలోని కొంపల్లి, కుత్బుల్లాపూర్, గోషామహల్‌లో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యనేతలు పాల్గొననున్నారు. #KhabarLive