అందుబాటు ధరల గృహాల గురించి దేశమంతటా చర్చ జరుగుతున్నది. ఇంతకీ, మన నగరంలో అందుబాటు గృహానికి నిర్వచనమేమిటి? ఎన్ని లక్షల్లోపు ఫ్లాట్ అయితే అందుబాటు గృహాల పరిధిలోకి వస్తుంది? ఇంతకీ హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి? అమ్ముడుకాని ఫ్లాట్లు అధికంగా హైదరాబాద్‌లో ఉన్నాయని చేసే ప్రచారంలో ఎంతవరకూ వాస్తవముంది? ఇలాంటి అనేక ఆసక్తికరమైన అంశాలను క్రెడాయ్ హైదరాబాద్ వెల్లడించింది. నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘసభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ రియల్ రంగం తాజా పోకడలపై ప్రత్యేకంగా వివరించారు. మరి, వారు చెప్పిన అంశాల సారాంశం వారి మాటల్లోనే..

హైదరాబాద్‌లో అందుబాటు ధర గల ఫ్లాటు అంటే.. సుమారు ముప్పయ్ నుంచి నలభై లక్షలని చెప్పొచ్చు. ప్రస్తుతం నగరంలో సుమారు యాభై శాతం కంటే అధికంగా ఈ ధరకే అపార్టుమెంట్లు లభిస్తున్నాయి. కాకపోతే, వీటిని సొంతం చేసుకోవాలంటే.. శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఉదాహరణకు కొంపల్లి, పటాన్‌చెరు వంటి ప్రాంతాల్లో చదరపు అడుక్కీ రూ.3,000 ఫ్లాట్లు లభిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ కలిసి పని చేస్తేనే సొంతిల్లు కొనుక్కునే పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఇండ్ల ధరలు పెరిగినా, గత కొంతకాలం నుంచి పెద్దగా పెరగలేదు. కాబట్టి, నేటికీ ఇండ్ల ధరలు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. సిమెంటు, స్టీలు ధరలు పెరిగినా, ఇండ్ల ధరలను పెంచడానికి డెవలపర్లు ప్రయత్నించడం లేదు. భాగ్యనగరంలో భూముల ధరలు ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరిగాయి. మౌలిక సదుపాయాలు మెరుగయ్యే ప్రాంతంలో స్థలాల రేట్లు సుమారు ముప్పయ్ శాతం మేరకు అధికమయ్యాయి. పశ్చిమ హైదరాబాద్‌లో మాత్రం ఈ పెరుగదల గత కొంతకాలం నుంచి అతిపెద్దగా కనిపిస్తోంది. తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరీ ఎక్కువుంది.

ALSO READ:  Telangana Digital Wallet Pinches Public Pockets With Technical Glitches

-ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల కారణంగా.. రియల్ రంగంలో ఇండ్లకు సరికొత్త ఆదరణ పెరిగింది. జీఈఎస్ సదస్సు, మెట్రో ప్రారంభం, వరల్డ్ ఐటీ కాంగ్రెస్, బయో ఏషియా సదస్సు.. ఇలాంటివన్నీ విజయవంతం కావడంతో ఒక్కసారిగా హైదరాబాద్ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. భాగ్యనగరంలో అడోబ్ కార్యాలయం ఏర్పాటు, బుద్వేల్‌లో నాస్కామ్ కేంద్రం, నగరానికొచ్చిన విప్రో సబ్బుల పరిశ్రమ, ఇదే బాటలో రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలు హైదరాబాద్ బాటపడుతున్నాయి. ఫలితంగా, రియల్ రంగానికి ఎక్కడ్లేని గిరాకీ పెరుగుతోంది.

-తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల కారణంగా, ఆఫీసు స్థలానికి హైదరాబాద్‌లో ఎక్కడ్లేని గిరాకీ పెరిగింది. దీని వల్ల వచ్చే రెండేండ్లలోపు 9 కోట్ల చదరపు అడుగుల వాణిజ్య స్థలం అందుబాటులోకి రానున్నది. దీంతో, 3 నుంచి 4 లక్షల చదరపు అడుగుల నివాస సముదాయాలకు వచ్చే రెండేండ్లలోపు హైదరాబాద్‌లో గిరాకీ ఏర్పడుతుంది. ఇరవై నుంచి ముప్పయ్ దాకా షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సుల నిర్మాణం జోరుగా జరుగుతోంది. మొత్తానికి, ఎలా చూసినా హైదరాబాద్ రియల్ రంగానిక బంగారు భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు.#KhabarLive