పీలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒళ్లు గగుర్పొడిచే పోరాట దృశ్యాలతో, ఉత్కంఠభరితమైన మలుపులతో, హీరోగా, ప్రతిపక్ష నేతగా సీఎం చంద్రబాబు నాయుడు ద్విపాత్రాభినయం చేస్తున్న అద్భుత యాక్షన్‌ సినిమా జనం చూస్తున్నారు. ఈ సినిమాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడుతున్నట్లు కనిపించే హీరో ఆయనే.

ఎన్‌డీఏలో కొనసాగుతూనే బీజేపీకి ప్రత్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నదీ ఆయనే. ఒక అనైతిక, అసంపూర్ణ, సర్దుబాట్లతో కూడిన పోరాటాన్ని విశ్లేషకులు వీక్షిస్తున్నారు. చంద్రబాబు కుటిల రాజకీయాలు చేయగలరేగాని, ధైర్యంగా వ్యవహరించే నాయకుడు కాడని అర్థమైపోయింది. రాజకీయాల్లో సహజంగానే కుటిలత్వం ఉంటుంది. తెరచాటు పనులు జరుగుతుంటాయి. తెర వెనక ఒకలా, తెర ముందు ఒకటా వ్యవహరించడమే రాజకీయం. ఈ విద్య చంద్రబాబుకు బాగా తెలుసు.

ఆయన ఇప్పటివరకు తెరచాటు రాజకీయాలతోనే హీరోగా ప్రచారం పొందారేతప్ప ధైర్యంగా, నైతికంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. దానికితోడు మీడియా మేనేజ్‌మెంట్‌ బాగా తెలుసు కాబట్టి ఆయన అనైతికత ప్రజల బుర్రల్లోకి వెళ్లకుండా చేయగలిగిన అనుకూల మీడియా ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ టీడీపీ సాగిస్తున్న పోరాటం పూర్తిగా అనైతికమని చెప్పుకోవచ్చు.

ALSO READ:  Is Hyderabad Metro Rail Project In Deep Financial Trouble?

అంతేకాకుండా చాలా ప్రశ్నలకు బాబు దగ్గర జవాబులూ లేవు. కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా కేంద్రంలోని ఇద్దరు మంత్రుల చేత రాజీనామా చేయించారు. బాగానే ఉంది. కాని ఎన్‌డీఏలోనే కొనసాగుతూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడమేమిటి? శత్రుత్వం, మిత్రత్వం ఒకే ఒరలో ఇమిడే రెండు కత్తులా?

వ్యతిరేకిస్తే కేంద్రాన్ని, ఎన్‌డీఏను పూర్తిగా వ్యతిరేకించాలి. స్నేహంగా ఉండదల్చుకుంటే కేంద్రంలో మంత్రులను ఉంచవచ్చు. ఎన్‌డీఏలోనూ కొనసాగాలి. కాని బాబు ఒక కాలు బయటపెట్టారు. మరో కాలు లోపల పెట్టారు. కూటమిలోని మిత్రపక్షానికి కేంద్రంలో మంత్రులు ఉండొచ్చు, లేకపోవచ్చు. పదవులు తీసుకోకుండా పార్టీలు కేంద్రంలో మద్దతు ఇచ్చిన సందర్భాలున్నాయి.

ఇక్కడ అసలు విషయం టీడీపీ ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు రాకపోవడమే. కూటమిలో కొనసాగుతూ పోరాటం చేయడం అనైతికం. చంద్రబాబు తెలివిగా కూటమిలో కొనసాగుతూ, మంత్రులను ఉపసంహరించుకొని దాన్ని పెద్ద పోరాటంగా ప్రచారం చేయించుకుంటున్నారు. కాబట్టి ఇది నాటకమే తప్ప నిజమైన పోరాటం కాదు.

ALSO READ:  Is Telangana CM KCR’s Federal Friendship Boon Or Bane?

హోదాపై ప్రజలను ఎలా మభ్యపెట్టారో ఇప్పుడు పోరాటం పేరుతో మభ్యపెడుతున్నారు. బాబు అనైతికతకు నిదర్శనం పార్టీ ఫిరాయింపులు. టీడీపీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలతో, ఎంపీలతో రాజీనామా చేయించకుండానే కేవలం కండువాలు కప్పి వారిని టీడీపీవారిగా మార్చుకున్నారు. కాని శాసనసభ రికార్డుల్లో, పార్లమెంటు రికార్డుల్లో ఫిరాయింపుదారులు వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలుగానే ఉన్నారు. వారిపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేకపోయారు. ఇదే అనైతికత హోదాపై పోరాటం నాటకంలోనూ కనబడుతోంది. ఎన్‌డీఏ నుంచి బయటకు రాకుండా ప్రత్యర్థిగా పోరాటం చేయడం చంద్రబాబు పిరికితనానికి నిదర్శనం.

సో…ఆయనకు కొన్ని భయాలున్నాయని అర్థమవుతోంది. ప్రధాని మోదీ తనను వేధించవచ్చనే అనుమానం ఉంది. ‘కేంద్రం వైఖరి పూర్తిగా తేటతెల్లమైన తరువాతనే మంత్రుల చేత రాజీనామా చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు’ అని టీడీపీ నేతలు చెప్పారు. మరి పూర్తిగా తేటతెల్లమైన తరువాత ఎన్‌డీఏలో ఎందుకు కొనసాగుతున్నట్లు? ఏ కనబడని కారణాలతో కొనసాగింపు జరుగుతోంది? …ఇలాంటి ప్రశ్నలకు బాబు దగ్గర, టీడీపీ నేతల దగ్గర సమాధానాలు లేవు. మనం ఒకటి అడిగితే వారు మరొకటి చెబుతారు. చంద్రబాబు పోరాట నాటకం ఎన్నికల వరకూ కొనసాగుతుందా? #KhabarLive