ల్లిదండ్రుల రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొనేందుకు ఇటీవల చాలామంది ముందుకొస్తున్నారు. వారిలో చాలామంది పెద్దపెద్ద చదువులు చదివినవారే. అయితే వారెవరూ కూడా కొత్త రాజకీయాలు నడపడానికి సిద్ధంగా లేరు. తమ తల్లిదండ్రుల సాంప్రదాయ రాజకీయాలకు దూరంగా ఉంటామన్న మాట ఇంతవరకూ ఒక్కరి నోటి నుండి కూడా వినపడలేదు. మరి విద్యార్థులకు ఎవరు రోల్‌ మోడల్స్‌?

సీబీఎస్‌ఈ పరీక్షల ప్రశ్నాపత్రాలు ముందే బయటకు రావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు రాసే పరీక్షలు కాబట్టి స్పందనలు కూడా ఆ స్థాయిలోనే వస్తున్నాయి. రెండు పరీక్షలు మళ్ళీ జరుగుతాయనేసరికి కష్టపడి పరీక్షలకు కూర్చున్న విద్యార్థులు హతాశులయ్యారు. ఆపై ఆగ్రహంతో నిరసనలకు దిగారు. చీటింగ్‌ చేసి మార్కులు కొట్టేయాలన్న కొందరి దురాశ ఈ పరిస్థితికి దారితీసింది.

పరీక్షల్లో చీటింగ్‌ భారత సమాజానికి కొత్తేమీ కాదు. పదవ తరగతి నుంచి మొదలుకొని ఉన్నత వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల వరకూ డజన్ల సార్లు పేపర్‌ లీకులు సంభవించాయి. అధికారులు జాగ్రత్తలు పెంచే కొద్దీ అక్రమార్కుల తెలివితేటలు కూడా పెరుగుతున్నాయి. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో వచ్చిన విప్లవాత్మక అభివృద్ధి చదువులో విపరీతమైన పోటీకి దారితీసింది. ఈ పోటీ పరిణామాల్లో చీటింగ్‌ ఒకటి.

ఈ చీటింగ్‌ చదువులకు మాత్రమే పరిమితమని అనుకోనక్కరలేదు. చదువుల లక్ష్యం ఉద్యోగం కాబట్టి ఆ ఉద్యోగాలు సంపాదించేందకు కూడా చీటింగ్‌కు పాల్పడుతున్నారు. వ్యక్తుల స్థాయిలో జరిగే చీటింగ్ ఒక రకం అయితే, వ్యవస్థీకృతంగా జరిగే చీటింగ్‌ మరో రకం. ఐఏఎస్‌ సాధించడం కోసం ఒక ఐపీఎస్‌ అధికారి అడ్డంగా దొరికిపోయిన ఉదంతం మొదటిదానికి ఉదాహరణ. మధ్యప్రదేశ్‌లో సంభవించిన వ్యాపం కుంభకోణం రెండవ దానికి ఉదాహరణ.

సీబీఎస్‌ఈ పేపర్‌ లీక్‌ వార్తలు వస్తున్నప్పుడే మరో రకమైన చీటింగ్‌ వార్తలు కూడా మీడియాలో వచ్చాయి. కేంబ్రిడ్జి ఎనలిటికా అనేక పొలిటికల్‌ కన్సల్టెన్సీ సంస్థ తమ క్లయింట్లను గెలిపించేందుకు ఎలాంటి పద్ధతులకు దిగుతున్నదో మీడియా బయటపెట్టేసరికి ప్రపంచం నివ్వెరపోయింది. 2016లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ సంస్థ క్లయింట్‌. కేంబ్రిడ్జి ఎనలిటికా కార్యకలాపాలు ఇండియాకు కూడా విస్తరించాయన్న వార్త ఆ తర్వాత బయటకొచ్చింది. అయితే, తమ అక్రమ పద్ధతులకు అవసరమైన లక్షలాది ప్రజల పర్సనల్‌ డేటాను కేంబ్రిడ్జి ఎనలిటికా ఒక యాప్‌ ద్వారా ఫేస్‌బుక్‌నుంచి సంగ్రహించిందన్న వార్త పుట్టించిన గగ్గోలుతో పోల్చుకుంటే, ఆ సంస్థ ఇండియా ఎన్నికలను కూడా ప్రభావితం చేసిందన్న వార్త కలిగించిన కలవరం లెక్కలోకే రాదు.

ALSO READ:  Bright Kid @ Home To Engage Pre-Schoolers Through Unique Activity Based Home-Schooling Program

సూక్షంగా చెప్పాలంటే కేంబ్రిడ్జి ఎనలిటికా తన క్లయింటు (ఎన్నికలలో పోటీ చేసే రాజకీయ పార్టీ) విజయానికి దొంగ పద్ధతుల్లో సహాయపడుతుంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఓటర్ల పర్సనల్‌ డేటాను సేకరించి వారి అభి ప్రాయాలు, అభిరుచులు తెలుసుకొంటుంది. ఆ ప్రొఫైల్‌ ప్రకారం వారిని ప్రభావితం చేసేవిధంగా ఆన్‌లైన్‌ ‘ప్రచార దాడి’ మొదలుపెడుతుంది. కులం, మతం మొదలుకొని అన్ని రకాల అంశాలనూ ఇందుకు ఉపయోగించుకొంటుంది. ఈ భావోద్వేగాలపై ‘దాడి’లోతులు ఇంకా ఖచ్చితంగా తెలియవు. ఏఐక్యూ అనే ఇలాంటి మరో సంస్థ నైజీరియాలో ప్రజాభిప్రాయాన్ని ప్రభావింతం చేసేందుకు హింసాత్మక వీడియోలను ఆన్‌లైన్‌లో వ్యాప్తి చేపింది.

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేది అధికారం చేపట్టడానికి. అధికారం చేపట్టేది స్వేచ్ఛ, సమానత్వం ప్రాతిపదికగా ఉత్తమ సమాజం నిర్మాణానికి, ఆ సమాజాన్ని ప్రజారంజకంగా పాలించడానికి. ఈ లక్ష్య సాధనకు తాము అనుసరించే మార్గమేమిటో ఆయా రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరించాలి. నచ్చిన వారిని ప్రజలు ఎన్నుకొని అధికారం అప్పగిస్తారు. ఈ ప్రజాస్వామిక చట్రం వెలుపల గెలుపు కోసం ఇంకేం పనిచేసినా అది అక్రమమే.

కేంబ్రిడ్జి ఎనలిటికా నిర్వాకాలను బయటపెట్టిన ఆ సంస్థ మాజీ ఉద్యోగి క్రిస్టఫర్‌ ఎయిలీని మొన్న బ్రిటీష్‌ పార్లమెంటరీ కమిటీ ఒకటి ప్రశ్నించింది. ఇండియాలో కేంబ్రిడ్జి ఎనలిటికా కార్యకలాపాలను ఆయన బయటపెట్టింది కూడా ఆ కమిటీ ముందే. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు రావాలా వద్దా అన్న అంశంపై ఆ మధ్య జరిగిన ఎగ్జిట్‌ రెఫరెండమ్‌లో బయటకు రావాలన్న పక్షం తరపున ఏఐక్యూ పనిచేసింది.

ఏఐక్యూ ప్రచారం రెఫరండమ్‌ ఫలితాన్ని తారుమారుచేసి ఉంటుందా? అన్న ప్రశ్నకు క్రిస్టఫర్‌ ఎయిలీ సమాధానం ఇస్తూ ‘ఫలితం ఏమిటన్నది ప్రధానం కాదు. ఇది చట్ట ఉల్లంఘన. ఇది చీటింగ్‌’ అన్నారు. అవును ఇది ముమ్మాటికీ చీటింగ్‌.

సిబిఎస్‌ఇ పరీక్షల్లో చీటింగ్‌ గురించి రాస్తూ కేంబ్రిడ్జి ఎనలిటికా గురించి ప్రస్తావిస్తున్నది ఇందుకే. పరీక్షల్లో చీటింగ్ చేసి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకొనే విద్యార్థికీ, ఉద్యోగం సంపాదించుకోవాలనుకొనే విద్యాధికుడికీ ఈ సమాజంలో ఎవరు రోల్‌ మోడల్‌? ఎవరిని మార్గదర్శకులుగా, ఆదర్శప్రాయులుగా భావించాలి. ఎన్నిసార్లు చట్టానికి చిక్కినా, పరీక్షల వ్యవస్థను ఎంత పకడ్బందీగా రూపొందిస్తున్నా ప్రశ్నా పత్రాల లీక్‌కు ప్రయత్నాలు ఆగడం లేదు. ఎందుకని? ఎందుకంటే సమాజంలో ఆ అడ్డదారికి డిమాండ్‌ పెరిగిపోతోంది. మరి డిమాండ్‌ అలా ఉన్నప్పుడు సప్లయికి ఎవరో ఒకరు ఎందుకు ప్రయత్నించకుండా ఉంటారు? చుట‍్టూ ఉన్న వ్యవస్థలన్నీ, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ, అవినీతిలో మునిగితేలుతున్నప్పుడు ఒక్క విద్యార్థులు మాత్రమే సన్మార్గాన్ని పట్టుకు వేలాడుతారని ఎలా ఆశించగలం?

ALSO READ:  'Ghost College' In Osmania University Rolls Loses Affiliation And Put The Fate Of Students In Lurch

నిజమే, సమాజ నిర్మాణం జరిగేది విద్యాలయాల్లోనే; వాటి నుంచి ఎలాంటి యువతీ యువకులు బయటకొస్తున్నారన్నదే ఆ సమాజం భవితను నిర్దేశిస్తుంది; అవును నిజమే. సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి సంఘటనలు అందుకే ఎక్కువ ఆందోళన కలిగిస్తాయి. ఈ ధోరణులకు అడ్డుకట్ట వేయాల్సింది ప్రభుత్వాలు; అంటే ప్రభుత్వాలను నడిపే రాజకీయ పార్టీలు. మరి ఆ రాజకీయ పార్టీలు, వాటిని నడిపే రాజకీయ నాయకులు అవినీతి విద్యలో ఆరితేరి పోయినపుడు ఎవరు ఎవరికి ఆర్శప్రాయులు?

కేంబ్రిడ్జి ఎనలిటికా వంటి సంస్థల సహాయంతో అక్రమ మార్గాల్లో ప్రజల మద్దతును కూడగట్టడం వంటి ధోరణులు ఇటీవలి పరిణామాలు. ఇంటర్నెట్‌ ఆధారిత సమాజంలో పుట్టిన విషధోరణులు ఇవి. ఇవేవీ లేకముందు కూడా అవినీతి ఉంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఒక రాజకీయ పక్షం, అధికారాన్ని కైవసం చేసుకునేందుకు మరొక రాజకీయ పక్షం శాయశక్తులా అవినీతికి పాల్పడడం అత్యంత సాధారణ విషయంగా మారిపోయింది.

పార్టీల అవినీతికి తోడు ఆ పార్టీల్లోని నాయకుల అవినీతి ఉండనే ఉంది. వ్యక్తిగతంగా ఆస్తులు పోగేసుకోవడంతో పాటు, అవినీతికి లైసెన్స్ వంటి ప్రజాప్రతినిధి పదవిని నిలుపుకోవడం కోసం వారు నిరంతరం అవినీతి దారిలోనే పయనిస్తుంటారు.

రాజకీయనాయకులు అందరూ అవినీతిపరులే అని చెప్పడం సాహసమే అవుతుంది కానీ నిజాయితీపరుడైన రాజకీయవాది అయినాగానీ ఈ పార్టీ రాజకీయాల చట్రంలో పరిమితికి మించి డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికలలో గెలవడం సాధ్యమేనా? ఇంతవరకూ ఎవరైనా ఒక్కరయినా అలా పోటీ చేశారా? ఒకవేళ ఎవరైనా దానికి ముందుకొస్తే ఆ నాయకుడి పార్టీ అందుకు అంగీకరిస్తుందా?

ALSO READ:  Why Govt Mulls Removing Governor As Chancellor In Telangana? 

భారత సమాజంలో రాజకీయ అవినీతి గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఇదొక విషవలయం. ఈ వలయం వెలుపల కొత్త రాజకీయాలు నడపడం అంత తేలిక కాదు. రాజకీయాలలో అవినీతి నిర్మూలన అవసరం గురించి నీతులు చెప్పడంలో అందరికన్నా ముందుండేది రాజకీయ నాయకులే. అయితే అందరూ అమూర్త శబ్దాలకు పరిమితం అయ్యేవారే. నేను అవినీతి దారుల్లో ఇంత సంపాదించాను అని ఏ రాజకీయ నాయకుడు చెప్పడు. అలా ఆశించడం దురాశ కదా అని ఎవరైనా అనొచ్చు. పార్టీ రాజకీయాల్లో పాల్గొనే ఇన్ని వేల మంది నాయకుల్లో ఒక్కరైనా అలాంటివారు ఉండక పోవడం ఎంత విషాదం! కనీసం రాజకీయాలనుంచి రిటైర్‌ అయిన తర్వాత అవినీతి అంతా బయటపెట్టుకోకపోయినా కనీసం, తాను ఎన్నికల్లో గెలవడానికి ఎంతెంత ఖర్చు చేయాల్సి వచ్చిందీ చెప్పడానికి ఒక్కరు ముందుకు రాలేరా? మరి కొత్త రాజకీయాలకు నాంది ఎలా సాధ్యం?

తల్లిదండ్రుల రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొనేందుకు ఇటీవల చాలామంది ముందుకొస్తున్నారు. వారిలో చాలామంది పెద్దపెద్ద చదువులు చదివినవారే. అయితే వారెవరూ కూడా కొత్త రాజకీయాలు నడపడానికి సిద్ధంగా లేరు. తమ తల్లిదండ్రుల సాంప్రదాయ రాజకీయాలకు దూరంగా ఉంటామన్న మాట ఇంతవరకూ ఒక్కరి నోటి నుండి కూడా వినపడలేదు. మరి విద్యార్థులకు ఎవరు రోల్‌ మోడల్స్‌?

జాతీయోద్యమంలో పాలుపంచుకొని, తర్వాత స్వతంత్ర భారత నిర్మాణంలో తమవంతు పాత్ర నిర్వహించిన మహామహులు ఆనాటి యువతరానికి రోల్‌మోడల్స్‌. క్రమేపీ రాజకీయాలు అడ్డదారి తొక్కాయి. రాజకీయాలకు అవినీతి పర్యాయపదంగా మారిపోయింది. ఇప్పుడు టెక్నాలజీని ఆసరాగా తీసుకొని కేంబ్రిడ్జి ఎనలిటికా వంటి కన్సల్టెన్సీ సంస్థల ద్వారా చీటింగ్‌ గేమ్‌ మొదలయింది. రాజకీయరంగంలో వచ్చిన ఈ మార్పు సమాజంలోని అన్ని రంగాలలోనూ ప్రతిఫలిస్తుంది. రాజకీయం తర్వాత భారతీయులకు బాగా ఇష్టమైన సినిమా రంగాన్ని తీసుకోండి. ఆ రోజుల్లో కథానాయకుడు ధీరోదాత్తుడు. ఒంటిచేత్తో దుష్ట శక్తులను రూపుమాపగల ధీశాలి. మరి ఇప్పుడో? ఇప్పటి కథానాయకుడు అల్లరిచిల్లరగా తిరిగే పనీపాటా లేని మనిషి. స్ర్తీలంటే ఏమాత్రం గౌరవం లేనివాడు. లక్ష్య సాధనకోసం నేరం చేయడానికైనా వెనుకాడని వ్యక్తి. చూడండి మన రోల్‌ మోడల్స్‌, మనం ఎంతదూరం ప్రయాణించామో! #KhabarLive