చుట్టూముట్టూ హైదరబాద్. నట్టా నడుమ చార్మినార్. చార్మినార్ కొమ్ము కింద.. నువ్వు కొలువుదీరినావే బంగారు మైసమ్మా అంటూ భాగ్యనగరమంతా ఒగ్గుడోలు చప్పుళ్లు.. పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల శిగాల సందళ్ల మధ్యన బోనమెత్తి సంబురపడుతున్నది తెలంగాణ. గోల్కొండ జగదాంబకు తొలి బోనం ఎక్కింది. లష్కర్ మహంకాళికి మలి బోనమూ ఎక్కింది.

ఇక లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి నుంచి మొదలు పెడితే తెలంగాణ ఊరూరా.. పల్లె పల్లెనా పరమాన్నం పెట్టి తల్లిని కొలిచేందుకు మనమంతా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ చూసినా బోనాలే.. కల్లు సాకలే కన్నుల పండుగలై కనిపిస్తున్నాయి. ఏ మనిషి మొఖంల చూసినా బోనాల సంబురమే.. ఎవ్వరి ఫోన్ల విన్నా బోనాల పాటల సంతోషమే సందడి చేస్తున్నాయి.

నేను మాత్రమే బాగుండాలి అనుకుంటే స్వార్థం. నాతో పాటు నా చుట్టూ ఉన్నవాళ్లు బాగుండాలి అని కోరుకోవడం పరోపకారం. బోనాల పండుగలో అంతర్లీనంగా ఈ భావమే దాగి ఉంటుంది. తన కుటుంబం కోసం.. తన వాడకట్టు కోసం.. తన సమూహం కోసం.. ఊరు కోసం దేవతను కొలుస్తూ నైవేద్యం పెడుతూ వేడుకునే పండుగ ఇది.

అది 1869వ సంవత్సరం. హైదరాబాద్‌లో ప్రాణాంతక మలేరియా వ్యాధి ప్రబలింది. చూస్తుండగానే వేలాదిమంది దీనికి బలయ్యారు. నియంత్రణ చర్యలు ఎన్ని చేపట్టినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఏం చేయాలి? పిట్టల్లా రాలుతున్న పిల్లలను ఎలా కాపాడుకోవాలి? అని పెద్ద మనుషులు ఆలోచించారు. మాతృ ఆరాధనను నమ్మే.. గౌరవించే సంప్రదాయం ఉన్న మనం ప్రకృతిమాత అయిన జగన్మాతను ఆరాధించాలి అనుకున్నారు. ఎలా? ప్రకృతిమాత చిత్రాన్న ప్రియ అని స్ర్తోత్రాలు చెప్తున్నాయి. కాబట్టి అమ్మకు మట్టికుండలో పరమాన్నం వండి బోనం సమర్పించి.. ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుమని వేడుకోవడం మొదలుపెట్టారు. క్రమంగా దీనిని ప్రతీయేటా ఒక ఉత్సవంగా నాటి హైదరాబాద్ సంస్థానమంతా జరిపించాలని నిర్ణయించారు.

ఇలా అప్పట్నుంచి తమ కోసం.. తమ చుట్టూ ఉన్న ప్రజల కోసం బోనం సమర్పిస్తూ వస్తున్నారు. ఒకానొక దశలో ఆనాటి నవాబులు సైతం బోనం విశిష్ఠత.. గొప్పదనం తెలుసుకొని పండుగను అధికారికంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారని చరిత్రకారులు చెప్తున్నారు. కుతుబ్‌షాహీల ఆస్థాన అధికారులైన అక్కన్న-మాదన్నలు ఈ బోనాల బాధ్యతలను చూస్తుండేవారనీ.. దానికి ఆషాఢమాసం ఎంచుకొని ప్రతీయేటా వారి ఆధ్వర్యంలో బోనాలు ఘనంగా నిర్వహిస్తుండేవారట.

ALSO READ:  Will Congress Directly Fight With BRS In Telangana?

ఆ ఆనవాయితీలో నుంచి వచ్చిందే గోల్కొండ తొలి బోనం. కుతుబ్‌షాహీలు ఏలిన గోల్కొండ కోటలో నాటి నుంచి తల్లి జగదాంబకు మొదట బోనం సమర్పించిన తర్వాతే ఆషాఢబోనాలు ప్రారంభం అవుతాయి. ఈ యేడు ఇప్పటికే గోల్కొండలో తొలిబోనం అంగరంగ వైభవంగా సమర్పించారు.

మనది బోనం సంస్కృతి
నవాబుల కాలంలో తొలిసారిగా ప్రకృతిమాతకు బోనం సమర్పించగా అమ్మ కరుణించి ఏ వ్యాధుల బారిన పడకుండా ఎప్పుడైతే చూసిందో అప్పటి నుంచి బోనం యావత్ తెలంగాణ ప్రజ ప్రాణమైంది. ఊరూరా బోనాల ఊరేగింపు జరుగుతూ వస్తున్నది. తెలంగాణ సంస్కృతిలో ఇదొక ముఖ్యమైన సంప్రదాయంగా మారిపోయింది. ఇక.. బోనం ఊరూరా చేరుకుంది.

ఆపద మొక్కుల తల్లిగా.. శుభం ప్రసాదించే దేవతగా మారింది. క్రమంగా జరిగే ఆషాఢ బోనాలతోపాటు మొక్కులు తీరిన ప్రతీ సందర్భంలోనూ బోనం పెట్టడం ఒక ఆచారంగా వస్తున్నది. పంట బాగా పండితే.. చెరువుల్లోకి పుష్కలంగా నీళ్లొస్తే.. పిల్లల ఆరోగ్యం బాగుంటే.. పెండ్లయితే.. పిల్లలు పుడితే.. ఉద్యోగం వస్తే.. మనసుకు బాగా సంతోషం కలిగితే బోనం సమర్పించడం అలవాటుగా మారింది. మైసమ్మ, ఎల్లమ్మ, మారమ్మ, పోచమ్మ, దుర్గమ్మ, మాంకాలమ్మలను దేవతలుగా కొలుస్తూ బోనం పెట్టే సంప్రదాయం విస్తరించింది.

కట్ట మైసమ్మ, కోట మైసమ్మ, ఊర మైసమ్మ, గండి మైసమ్మల పేరిట కొలుస్తూ బోనం సమర్పించడం నిత్యకృత్యంగా మారిపోయింది. బీరప్ప, మల్లన్న, కాటమయ్యలకు కూడా బోనాలు ఎక్కిస్తున్నారు. ఏదో ఒక సందర్భంలో అనివార్యమై ఎక్కిన బోనం ఇప్పుడు ఆచారమై.. తెలంగాణ ఒడిలో నైవేద్యమై.. సంస్కృతియై.. సంప్రదాయమై శోభాయమానంగా విరాజిల్లుతున్నది.

ఎన్నెన్నో ప్రత్యేకతలు
బోనాల జాతరంటే మిన్నంటే డప్పుల దరువులు, తప్పెట మోతలు, పోతురాజుల విన్యాసాలు, ఫలహారాలు.. బంధువుల సందడి. బోనాల అలంకరణ, ఆడపడుచుల ఆనందం, యువకుల కోలాహలం.. ఒకటా.. రెండా.. బోనాల పండుగకు ఉన్నన్ని ప్రత్యేకతలు మరే పండుగకూ ఉండవేమో అనిపించేంతగా అంగరంగ వైభవంగా జరుగుతుందీ ఈ వేడుక.. ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయే ఈ జనజాతరలో మైకుల్లో మోగే జాన పదాలు.. ఆత్మీయుల పలకరింపులు.. అందరినీ సంబురపరుస్తాయి. ఈ సంబురాల జాతర జరుపుకునే సంప్రదాయాలపై భక్తులకు అపారమైన విశ్వాసం. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు నిర్వహించే ఈ ఆషాఢ జాతర కాలంలో ప్రతిరోజూ కనిపించే సన్నివేశాలివి. ఒక్కో సన్నివేశంలో ఓ విశిష్ఠత.. ఓ విశ్వాసం. బోనాల సంబరాలు సంప్రదాయ వస్త్రధారణలో ఆడపడుచులు..పోతురాజుల వీరంగాలు.. వందల ఏళ్లనాటి సంస్కృతిని మరోసారి ఆవిష్కరించనున్నాయి.

ALSO READ:  ‍'‍‍‍‍Hyderabad Cricket Association Prez Azharuddin Will Be Exposed Soon'

బోనమెట్లా చేస్తారంటే?
శక్తి స్వరూపిణి అయిన మహాకాళికి భక్తి ప్రపత్తులతో భోజనాన్ని మొక్కుకున్న రీతిలో సమర్పించుకొనడాన్ని బోనాలు అంటారు. ఆషాఢ జాతర రోజున స్త్రీలు తలస్నానం చేసి, పరిశుభ్రమైన వస్ర్తాలు ధరించి వారు మొక్కుకున్న రీతిలో అమ్మవారికి ప్రసాదం తయారుచేసి ఆ ప్రసాదాన్ని ఒక పాత్రలో ఉంచి, అది అపవిత్రం కాకుండా పాత్రపై దీపం పెడతారు. వీటిని తలపై పెట్టుకుని, వివిధ ప్రాంతాల నుంచి తరలి వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ రోజున స్త్రీలు ముఖానికి పసుపు పులుముకుని తడిబట్టలతో ఆలయానికి రావడం అనాదిగా వస్తున్న ఆచారం. మహిళలు బోనాలను నెత్తిపై పెట్టుకొని వాయిద్య కళాకారుల తప్పెట్ల మోతలతో, మంగళ వాయిద్యాలతో విభిన్న రీతుల నృత్యాలు చేసే పురుషులు వెంటరాగా అమ్మవారి గుడికి ఆనందోత్సాహాలతో తరలివెళ్లడం చూసేవారికి కనువిందు చేస్తుంది.

ఏ దేశమేగినా సంస్కృతి మనదేరా!
బోనం మన సంస్కృతిలో భాగమై మనతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్నది. మనం ఊరు మారినా.. ఇంకెక్కడో స్థిరపడినా ఆ పండుగను మాత్రం మర్చిపోలేని వాళ్లను చూస్తుంటాం. అంతెందుకు ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడినా అక్కడ కూడా ఇదే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ప్రవాస భారతీయ సంఘాలు ఒక్కటై బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నాయి.

ALSO READ:  How The EC's 'Mystery Technology' Destroyed The 'Mass Voter' Future In Telangana?

ఏ దేశమేగినా మన సంస్కృతి మనదే అంటూ చాటిచెప్తున్నారు. అమెరికాలో ప్రతీ సంవత్సరం టాటా ద్వారా కాలిఫోర్నియా, బే ఏరియాల్లాంటి తెలంగాణవాళ్లు ఎక్కువగా ఉండే ఏరియాల్లో బోనాల పండుగను నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉండే లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ బోనాలను సమర్పిస్తున్నారు. పటం గీసి.. ఘటం ఎత్తి.. ఫలహార బండ్ల ఊరేగింపులాంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది నిజంగా గొప్ప విషయం. పాశ్చాత్య సంస్కృతి పాతుకుపోయిన దేశంలో ఉండీ.. అక్కడి కల్చర్‌కు కనుచూపు మేరలో జీవిస్తూ కూడా మన ఆచారాలు పాటించడం అంటే గొప్ప విషయమే కదా? అందులోనూ అతి ప్రాచీనమైన.. జానపద నేపథ్యం ఉన్న తెలంగాణ బోనాల విశిష్ఠతను చాటిచెప్పడం అంటే అద్భుతమనే చెప్పాలి.

అమెరికా వెళ్లినా.. అట్లాంటా వెళ్లినా.. మెల్‌బోర్న్‌లో ఉన్నా.. ఫ్రీమాంట్‌లో సెటిల్ అయినా వేల సంవత్సరాల నాటి అక్కన్న మాదన్నలు నేర్పిన.. నవాబులే దిగొచ్చి దగ్గరుండి బోనమెక్కించిన ప్రకృతి దేవతను కొలిచిన పండుగనే ఆచరిస్తున్నారు అంటే తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఎంత గొప్పవో.. ప్రజలతో ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉంటాయో చెప్పవచ్చు. బోనాలతో పాటు ప్రతీ సంవత్సరం తీరొక్క పూలతో బతుకమ్మ ఆటలు.. దసరా రోజు జమ్మిచెట్టు పూజలు.. అపూర్వ సమ్మేళనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ పండుగలన్నింటిలో మన కట్టు బొట్టు.. బోనం ఏమాత్రం చెక్కు చెదరకుండా కాపాడుతూ వస్తున్నారు. ఇలాంటి గొప్ప సంస్కృతికి వారసులుగా ఉన్నందుకు.. బోనాల తెలంగాణకు బిడ్డలమైనందుకు గర్వపడుదాం!

బోనాల పాటలు
పండుగ సంబురమంతా పాటల్లోనే కనిపిస్తుంది. గతంలో అయితే అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో అంటూ మైకుల్లో మోతలు మోగితే రెండు మూడు ఊర్లకు వినిపించేవి. ఇప్పుడు కూడా ఈ మైకుల హోరు ఉందనుకోండి. కాకపోతే యూట్యూబుల్లో.. టీవీ చానెళ్లలో సరికొత్త ట్రెండీ బోనాల సాంగ్స్ వస్తున్నాయి. ఒక్కొక్కటి మిలియన్ల కొద్దీ వ్యూయర్‌షిప్ సంపాదించుకుంటూ మన ట్రెడిషన్‌ను చాటడంలో పోటీ పడుతున్నాయి. #KhabarLive