ఒక వైపు ఉపాద్యాయులు మరో వైపు ప్రభుత్వం ఒకే సమస్య పై కొట్టుమిట్టాడుతున్నారు. అయితే, పరిష్కారం దొరుకోవటం లేదు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తే కొత్త సమస్య తలెత్తే అవకాశం ఉందని విద్యా శాఖ భావిస్తోంది.
- టీచర్ల ప్రమోషన్ల విషయంలో కొత్త సమస్య
- గ్రామాల్లో ఖాళీలు పెరగొచ్చని ఆందోళన
- పదోన్నతులు, బదిలీలపై అధికారుల కసరత్తు
- ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో కదలిక
ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తే కొత్త సమస్య తలెత్తే అవకాశం ఉందని విద్యా శాఖ భావిస్తోంది. ప్రమోషన్లతోపాటు బదిలీలను కూడా నిర్వహించాల్సి ఉండడంతో.. గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తోంది. దాంతో కొత్త సమస్య తెరపైకి వస్తుందేమోనన్న సందేహం అధికారుల్లో మొదలైంది. త్వరలో ఉపాఽధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో… పదోన్నతుల అంశంపై మళ్లీ కదలిక వచ్చింది. కొంతకాలం నుంచి ఉపాధ్యాయులు ప్రమోషన్ల కోసం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో దీనిపై హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ప్రమోషన్లపై అధికారులు తాజాగా కసరత్తును మొదలుపెట్టారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని అనుసరించి టీచర్ల పదోన్నతులకు సంబంధించిన ఫైల్‌ను త్వరలోనే ఆర్థిక శాఖకు పంపించడానికి విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే… సాధారణంగా టీచర్లకు పదోన్నతులను కల్పించాలంటే, అదే సమయంలో బదిలీలను కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువమంది టీచర్లు పట్టణ ప్రాంతాల్లోకి రావడానికి కోరుకుంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాంతో గ్రామీణ విద్యార్థులకు నష్టం వాటిల్లనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీన్ని నివారించాలంటే రేషనలైజేషన్ కూడా అదే సమయంలో చేపట్టాల్సి ఉంటుంది. దీనికి ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించాలి. చాలా ఏళ్ల తర్వాత పదోన్నతులు, బదిలీలను చేపడుతున్నందున… తాము కోరుకున్న ప్రాంతానికి వెళ్లాలన్న డిమాండ్లు ఎక్కువగా వస్తాయి. ఈ నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా… రాష్ట్రంలో ఏడేళ్లుగా పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలను నిర్వహించలేదు.
దాంతో 1,970 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా 2,400 ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులు, 8,270 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటిలో 70ు పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అలాగే మొత్తం 10వేల మంది ఉపాధ్యాయులు బదిలీ అవుతారని అంచనా. మరోవైపు ప్రాథమిక పాఠశాలలకు కొత్తగా 5,571 ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ దీనిపై ఇంకా ఉత్తర్వులు జారీ కాలేదు. ఈ పోస్టులు మంజూరైతే… ఆ మేరకు ఉపాధ్యాయులకు మరిన్ని ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుంది. #KhabarLive #hydnews #telugunews #hydlive