కాంగ్రెస్‌ నేతలు విభేదాలు వీడటం లేదా? పీసీసీ చీఫ్‌పై ఫిర్యాదు చేసేందుకు రహస్యంగా సీనియర్ నేతలు భేటీ అయ్యారా ? పీసీసీ చీఫ్‌ను మార్చకపోతే భవిష్యత్‌పై బెంగ మొదలైందా ? రహస్యంగా నిర్వహించిన సమావేశానికి హాజరైన నేతలెవరు ?

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్ నేతలు ఏకమవుతున్నారు. రాహుల్‌ జన్మదిన సందర్భంగా ఢిల్లీ వెళ్లిన సీనియర్ నేతలు ఉత్తమ్ నాయకత్వానికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్సీ ఇంట్లో సమావేశమైనట్లు సమాచారం. ఈ భేటీలో పీసీసీ చీఫ్‌‌పై కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అణచివేత ధోరణి, గ్రూపు రాజకీయాలు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న ఉత్తమ్‌ వ్యవహారశైలిని రాహుల్ ముందుంచాలని డిసైడైనట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌ను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కష్టమని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఉత్తమ్‌ను మార్చకపోతే మరోసారి సమావేశమై యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించేందుకు సీనియర్లు రెడీ అవుతున్నారు.

ALSO READ:  Telangana's 'Kanti Velugu': 'Senior Citizens And Elders' Freely Regaining Eyesight

తనకు అనుకూలమైన వర్గానికే పదవులు కట్టబెడుతూ…ఉత్తమ్ గ్రూప్‌ రాజకీయాలు చేస్తున్నారని టీ కాంగ్ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తన వర్గాన్ని అణచివేయడంపై మాజీ మంత్రి ఉత్తమ్‌పై గుర్రుగా ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్‌, మహబూబ్‌నగర్‌లో డికే అరుణ టీం, రంగారెడ్డిలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గ్రూప్‌, ఖమ్మంలో భట్టి విక్రమార్క, మెదక్‌లో దామోదర్‌ రాజనర్సింహా, కరీంనగర్‌లో శ్రీధర్‌బాబు, వరంగల్‌లో గండ్ర వెంకటరమణారెడ్డి, ఆదిలాబాద్‌లో ప్రేమ్‌‌సాగర్‌ వంటి నేతలను ఉత్తమ్ అణచి వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయ్. సీనియర్లను అణచివేసి రెండో క్యాడర్‌ నేతలను ప్రొత్సహిస్తూ పదవులు కట్టబెడుతున్నారని విమర్శిస్తున్నారు. ఉత్తమ్‌ వ్యవహారశైలిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసేందుకు సీనియర్ నేతలు రెడీ అవుతున్నారు. వచ్చే నెల 2న ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటున్న నేతల ఫిర్యాదుపై రాహుల్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.#KhabarLive

ALSO READ:  ‘Telangana 'Hijra' Became Political Identity’