నిరుపేద మైనారిటీ యువతులను షాదీముబారక్ పథకం ఆర్థికంగా ఆదుకుంటున్నది. వారికి ఆపద్బంధువులా నిలిచింది. ఎంతోమంది ఆ వర్గ మహిళలకు ఈ పథకం అండగా నిలిచి కొండంత ధైర్యాన్నిస్తున్నది. తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత ప్రారంభమైన షాదీముబారక్ ద్వారా సుమారు 76 వేల మంది మైనారిటీ పేద మహిళలు ప్రయోజనం పొందడమే ఇందుకు నిదర్శనం. ఈ సంఖ్య కూడా 2017 డిసెంబర్ 31 నాటిదే. గత నెలన్నర రోజుల్లో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగిందని అధికారికవర్గాలు తెలిపాయి.

పేద మైనారిటీ యువతుల వివాహాలకు ఆర్థిక సమస్యలు ఉండకూడదనే ఉద్దేశం, లక్ష్యంతో సహాయం అందించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు షాదీముబారక్ పథకాన్ని తీసుకొచ్చారు. గ్రీన్ చానెల్ ద్వారా బడ్జెట్ కేటాయించి నిధులు విడుదలలో జాప్యం జరుగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద మైనారిటీ యువతుల వివాహాల సమయంలో తొలుత రూ.15 వేలు, అనంతరం రూ.25 వేల విలువ చేసే సామగ్రి అందించే వారు. అది కూడా చాలా తక్కువ మందికి లభించేది. పైగా వివాహాలు సామూహికంగా ఒకే వేదికపై నిర్వహించేవారు. చాలామంది ముస్లిం కుటుంబాలకు ఈ విధానం నచ్చకపోయేది.

ALSO READ:  'Serlingampally Constituency', The 'Richest' And 'The Best' In Telangana State

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ, ఎస్టీలకు అమలుచేసే కల్యాణలక్ష్మి తరహాలో మైనారిటీవర్గాలకు షాదీ ముబారక్ పథకాన్ని 2014 అక్టోబర్ రెండున టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద మైనారిటీ యువతి వివాహ సమయంలో రూ.51 వేలు నగదు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం తొలి ఏడాది 2014-15లో ఈ పథకాన్ని గ్రీన్ చానెల్‌లో చేర్చి రూ.100 కోట్ల నిధులు కేటాయించింది. తొలి ఏడాది నియమ నిబంధనలు, విధి విధానాలు, సిబ్బంది అక్రమాలు, పలు సమస్యల కారణంగా ఊహించిన స్థాయిలో ఈ పథకానికి అర్హుల ఎంపిక జరుగలేదు. దీంతో ఆ ఏడాది కేవలం 5779 మందికి రూ.29.54 కోట్ల నిధులు విడుదలయ్యాయి.

అనంతరం షాదీ ముబారక్ పథకంలో కొన్నిమార్పులు, పారదర్శకంగా అమలుచేయడానికి ప్రభుత్వం విధానాల్లో మార్పులు తీసుకురావడంతో రెండో ఏడాది నుంచి ఈ పథకానికి అపూర్వ స్పందన వచ్చింది. ఆర్థికసాయాన్ని కూడా రూ.51 వేల నుంచి రూ.75,116కు పెంచారు. ఇందుకోసం 2016-17 నుంచి నిధుల కేటాయింపును రూ.150 కోట్లకు పెంచి గత మూడున్నరేండ్లుగా నిధులను విడుదల చేస్తున్నది. 2014 అక్టోబర్ 2 నుంచి 2017 డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం షాదీ ముబారక్ పథకానికి మొత్తం రూ.500 కోట్ల కేటాయించి దానిలో రూ.408.55 కోట్లను విడుదల చేసింది. దీనిద్వారా 75,627 మంది నిరుపేద మైనారిటీ యువతులకు ఆర్థికసాయం లభించింది. తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన షాదీ ముబారక్ పథకం పట్ల మైనారిటీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ALSO READ:  ‍‍Is MLC Poll Results 'Wake-Up Call' For TRS Party In Telangana?

ఇదిలాఉండగా, షాదీ ముబారక్ పథకం లో లొసుగులు ఉన్నటు పలు వర్గాల్లో ఆరోపణలొస్తున్నాయి . దీని పై ప్రభుత్వం స్పందించి సమాధానం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. #KhabarLive