నిధులు లేక కొన్ని.. సిబ్బంది లేక మరికొన్ని నగర పంచాయతీలు లబోదిబో మంటున్నాయి. కొత్తగా నగర పంచాయతీలు ఏర్పాటుచేయడంలో చూపుతున్న శ్రద్ధ.. వాటికి వసతులు కల్పించడంలో కానరావడం లేదు. దీంతో ఆయాచోట్ల పాలన అస్తవ్యస్తంగా మారి పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2013 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 15 నగరపంచాయతీలను ఏర్పాటు చేశారు.

వివిధ జిల్లాల్లో ఐదు ఏర్పాటు కాగా మిగతావి హైదరాబాద్‌ చుట్టుపక్కల ఏర్పాటయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేసిన నగర పంచాయతీలకు ఆరంభంలో ప్రత్యేకంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం, ఉద్యోగులు, ఇతర సిబ్బందిని నియమించకపోవడంతో వాటిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రస్తుతం 15 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామపంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు హైదరాబాద్‌ బాహ్యవలయ రహదారి లోపల ఉన్న అన్ని పంచాయతీలను పురపాలనలోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసే నగర పంచాయతీలకు ఆరంభంలో ప్రత్యేకంగా నిధులు ఇవ్వడంతోపాటు అవసరమైన సిబ్బందిని నియమించినపుడే ఆ లక్ష్యం నెరవేరుతుంది.

ALSO READ:  Did you know these 5 Indian foods got GI tags?

అన్నీ అరకొరే..
* అచ్చంపేట నగరపంచాయతీకి ఎలాంటి ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. ప్రారంభంలో మేజర్‌ గ్రామపంచాయతీకి చెందిన ఏడుగురు ఉద్యోగులే నగర పంచాయతీలోకి వచ్చారు. 36 మంది ఉద్యోగులు అవసరం కాగా.. పోస్టులు మంజూరు కాలేదు. దాదాపు అంతా ఇన్‌ఛార్జీ అధికారులే.
* ఆందోలు-జోగిపేటకి ఆరంభ నిధులు ఇచ్చారు. సిబ్బందిలో అత్యధికం పొరుగుసేవల వారే. ఇప్పటి వరకు ఆరుగురు కమిషనర్లు, నలుగురు ఏఈలు బదిలీ అయ్యారు.
* జల్‌పల్లిలో ఉద్యోగులు ఐదుగురే. ప్రత్యేక నిధులు అందలేదు. ఇన్‌ఛార్జులు, తాత్కాలిక సిబ్బందితోనే నడుస్తోంది.
* కల్వకుర్తి నగర పంచాయతీగా మారిన సమయంలో 11 మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం కూడా అంతే మంది ఉన్నారు.
* మీర్‌పేట, జిల్లెలగూడలలో ప్రారంభంలో ఉన్నంత మంది సిబ్బందే ఇప్పుడూ ఉన్నారు.
* పెద్దఅంబర్‌పేటలో కమిషనర్‌, మేనేజర్‌, ఏఈ, టీపీఓ, పారిశుద్ధ్య అధికారి అందరూ డిప్యూటేషన్‌ మీద వచ్చిన వారే.
* బోడుప్పల్‌, పీర్జాదిగూడలకు ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రత్యేక నిధులు అందలేదు. ఉన్న ఉద్యోగుల్లో 60 శాతం తాత్కాలిక ఉద్యోగులే.
* దుబ్బాక నగర పంచాయతీకి నిధుల కొరతలేకున్నా ఉద్యోగులు లేక పౌరసేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
* బడేపల్లి, మేడ్చల్‌ నగర పంచాయతీలు కూడా సమస్యలతో సతమతమవుతున్నాయి.

ALSO READ:  In Telangana, KTR Takes Over Party Reins As KCR Eyes On National Politics

మాకొద్దీ నగర పంచాయతీ: ఖమ్మం జిల్లా మధిరకు నగర పంచాయతీ హోదా దక్కిన తొలి రోజుల్లో గ్రాంట్‌గా రూ.50 లక్షలు ఇచ్చారు. ఒక్క కమిషనర్‌ పోస్టు మాత్రమే మంజూరైంది. మొత్తం 36 మంది సిబ్బంది అవసరం కాగా కేవలం ఆరుగురితో నెట్టుకొస్తున్నారు. విలీనమైన మడుపల్లి, అంబారుపేట, ఇల్లందులపాడు ప్రజలు గతంలోలా గ్రామపంచాయతీలుగానే కొనసాగించాలని ధర్నాలు చేశారు. పన్నుల భారం, చిన్నపాటి ఇల్లు నిర్మించుకోవాలన్నా అనుమతుల కోసం పెద్దమొత్తంలో సొమ్ము చెల్లించాల్సి రావడంతో పాటు కొందరు కౌన్సిలర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

15 నగర పంచాయతీలు..
2013లో తొమ్మిది నగర పంచాయతీలు ఏర్పాటుకాగా 2015లో ఒకటి, 2016లో ఐదు ఏర్పాటయ్యాయి.
2013లో ఏర్పాటైన నగర పంచాయతీలు: అచ్చంపేట, ఆందోలు-జోగిపేట, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, పెద్దఅంబర్‌పేట, బడంగ్‌పేట, దుబ్బాక, మధిర, మేడ్చల్‌
2015లో: బడేపల్లి
2016లో: జల్‌పల్లి, మీర్‌పేట, జిల్లెలగూడ, బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ
(- అనంతరం బోడుప్పల్‌ ఫిర్జాదిగూడ, జల్‌పల్లి, మీర్‌పేట, జిల్లెలగూడ మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి) #KhabarLive