తెలంగాణ సర్కారు ఆగ్రహం ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులను బలి తీసుకుంది. హెడ్ ఫోన్స్ విసిరికొట్టారంటూ సర్కారు కన్నెర్రజేసింది. ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసింది. శాసనమండలి ఛైర్మన్ కంటికి గాయాలయ్యాయని సర్కారు చెప్పింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంతప్ కుమార్ విసిరిన హెడ్ ఫోన్స్ కారణంగానే స్వామిగౌడ్ కంటికి గాయమై ఆసుపత్రి పాలైనట్లు సర్కారు వెల్లడించింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సభా సాంప్రదాయాలను తోసిరాజని ఇద్దరు సభ్యులపై సర్కారు కసి తీర్చుకుందని కాంగ్రెస్ తో పాటు మిగతా రాజకీయ పక్షాలన్నీ విచారం వ్యక్తం చేశాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభ సభ్యత్వాల రద్దుపై నిన్నే అసెంబ్లీ గెజిట్ వెలువరించింది. దాన్ని మెరుపు వేగంతో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. త్వరలోనే వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజక వర్గాలకు ఎన్నికలు రాబోతున్నాయని కూడా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు నిన్న మీడియాతో జోస్యం చెప్పారు. కర్ణాటక ఎన్నికలతోపాటే ఈ రెండు ఉప ఎన్నికలు వస్తాయని, ఆ రెండు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు సర్కారు ఏకపక్ష తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాంగ్రెస్ చెబుతున్నది. ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది కాంగ్రెస్ పార్టీ. సర్కారు బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పింది. బహిష్కరణకు గురైన ఇద్దరు సభ్యులు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో గాంధీభవన్ లో 48 గంటల నిరహార దీక్షకు దిగారు. నిరహారదీక్షలో కాంగ్రెస్ యావత్ నేతలు, శ్రేణులు కదం తొక్కారు. దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. #KhabarLive