దేంటి… మామూలు ఇల్లే కదా అనుకుంటున్నారా? కానే కాదు… ఇది సనాతన శైలి, అధునాతన భావనలు కలగలిసిన ఓ నమూనా గృహం…
అంతేనా పర్యావరణ స్పృహ… ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే గట్టిదనం. ఈ ఇంటికి ఉన్న అదనపు సుగుణాలు… మరి…ఓ సారి ఆ ఇంటిని గురించి తెలుసుకుందాం… పదండి..!

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని బడంపేటలో యక్షి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘కూడలి’ పేరిట ఒక వేదికను అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణప్రాంతాల్లో యువతలో నైపుణ్యాలను పెంచడంతో పాటు సాగును లాభసాటిగా మార్చడమెలా అన్న అంశంపైనా ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ కార్యకలాపాల కోసం 2016 ఓ భవనాన్ని నిర్మించారు. ముంబయికి చెందిన ఆర్కిటెక్చర్‌ ఒకరు నారాయణఖేడ్‌ నియోజకవర్గంతో పాటు నర్సాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో పర్యటించి ఆనాటి ఇళ్లు, నిర్మాణశైలిని పరిశీలించారు.

ALSO READ:  ‍‍Why The Kakinada Petro Complex Still A Non-Starter In Andhra Pradesh?

వాటిని ప్రతిబింబించేలా ఈ ఇంటికి రూపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌, హిమాచలప్రదేశ్‌కు చెందిన నిపుణులతో పాటు స్థానికులనూ ఇందులో భాగస్వామ్యులను చేశారు. మట్టి, డంగుసున్నం, గడ్డిని పూర్తిస్థాయిలో వాడుకున్నారు. పైకప్పు కింద మట్టితో పాటు వేపకొమ్మలు వేశారు. గ్రామాలన్నీ తిరిగి గూనపెంకులు తెచ్చి పెట్టారు. గోడలు నునుపుగా ఉండటంతో పాటు మట్టి అట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకు గాను సన్నని దుబ్బమట్టితో మూడు పొరలుగా పైపూత పూశారు.

ఆకర్షణీయంగా ఉండేందుకు జాజును రంగుగా వాడారు. భూకంపాలు సంభవిస్తే భవనం దెబ్బతినకుండా చూసేందుకు చాలా తక్కువ స్థాయిలో మాత్రమే స్టీలు, సిమెంటు వాడారు. రూ.80లక్షల ఖర్చుతో దాదాపు మూడు సంవత్సరాల సమయం తీసుకొని దీన్ని పూర్తి చేశారు. మన నిర్మాణశైలిని భవిష్యత్తు తరాలకు అందించడంతోపాటు అందరికీ ఇదొక చక్కని వేదిక కావాలనే లక్ష్యంతో ఈ తరహాలో నిర్మాణం చేపట్టామని యక్షి సంస్థ డైరెక్టర్‌ మధుసూదన్‌ వివరించారు. కాంక్రీటు, స్టీలు చాలా నామమాత్రంగా వాడుకుంటూ… పూరిస్థాయిలో మట్టితో కట్టామన్నారు.

ALSO READ:  Will KCR Lead Charge 'Against CAA-NRC' Campaign On 'National Arena'?

ఇది వందేళ్లపాటు నిలిచి ఉంటుందన్నారు. ఈ ఎండాకాలంలోనూ ఏసీలూ, ఫ్యాన్లు లేకున్నా గదులన్నీ చాలా చల్లగా ఉండటం విశేషం. పర్యావరణహితంగా ఉండటంతో పాటు పాతకాలపు నిర్మాణాలను గుర్తుకుతెస్తున్న ఈ మట్టిభవనం అందరినీ ఆకర్షిస్తోంది. #KhabarLive

1 COMMENT

Comments are closed.