పది మంది సంతానాన్ని పెంచి పోషించాడు.. ఐదుగురు బిడ్డలకు పెండ్లి చేశాడు. అందరికీ మంచీచెడుల్లో అండగా నిలిచాడు. జీవితాన్ని కాచి వడబోశాడు.. కానీ 96 ఏండ్ల వయసులో నిస్సహాయ స్థితిలో రోడ్డున పడ్డాడు. కొడుకుల మధ్య జరిగిన చిన్న పొరపాటు ఆయనను వీధిపాలు చేసింది. అందరూ అయ్యో అన్నవాళ్లేకానీ ఇంటికి చేర్చే ప్రయత్నం చేయలేదు. దీం తో నమస్తే తెలంగాణ దినపత్రిక బృందం రంగంలోకి దిగి కాలనీవాసుల సహకారంతో ఆ వృద్ధుడిని కొడుకుల చెంతకు చేర్చింది.

ఈ ఘటన హైదరాబాద్ బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ వైదేహీనగర్‌లో ఆదివారం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్‌కు చెందిన ఆర్తం మల్లయ్యకు ఐదుగురు కొడుకులు, ఐదుగురు కుమార్తెలు. ఒక కొడుకు చిన్నప్పుడే వదిలి వెళ్లిపోగా, మిగతా నలుగురు కొడుకులు హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. పెద్ద కొడుకు గణేశ్ వనస్థలిపురంలో, రెండో కొడుకు శ్రీను చంపాపేట్ గ్రీన్‌పార్క్ కాలనీలో, మూడో కొడుకు చంద్రశేఖర్ నాగోల్‌లో ఉంటున్నారు. చిన్నకొడుకు విశ్వనాథంకు మతిస్థితిమితం లేకపోవడంతో మల్లయ్యతోనే ఉంటున్నాడు. మల్లయ్య బాధ్యత తీసుకునేవారే విశ్వనాథంను పోషించాల్సిన పరిస్థితి.

ALSO READ:  Mohammed Shabbir Ali - The Messiah Of Minorities In Telangana

మల్లయ్య భార్య పదేండ్ల కిందట కన్నుమూసింది. మల్లయ్య ఏడాది కాలంగా మూడో కొడుకు చంద్రశేఖర్ వద్ద ఉంటున్నాడు. అతడి పోషణకు కావాల్సిన డబ్బును గణేశ్, శ్రీను ఇస్తుండేవారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్యకు మల, మూత్ర విసర్జన సమస్య తీవ్రంగా ఉన్నది. దీంతో చంద్రశేఖర్ నివాసం ఉండే ఇంటి యజమాని మల్లయ్యను తమ ఇంట్లో ఉంచొద్దని తేల్చి చెప్పింది. దీంతో చంద్రశేఖర్ శనివారం మధ్యాహ్నం తండ్రిని ఆటోలో ఎక్కించుకొని అక్క దగ్గరికి వెళ్లాడు.

వారు మల్లయ్యను ఉంచుకునేందుకు అంగీకరించకపోవడంతో వనస్థలిపు రం వైదేహీనగర్‌లో ఉంటున్న పెద్ద కొడుకు గణేశ్ ఇంటికి వెళ్లాడు. గణేశ్ గుండెపోటుతో బాధపడుతూ దవాఖానలో చేరడంతో అందరూ గేటుకు తాళం వేసి వెళ్లారు. చంద్రశేఖర్‌కు ఏం చేయాలో పాలుపోక తన తండ్రిని గణేశ్ ఇంటి సమీపంలోని చెట్టుకింద పడుకోబెట్టి వెళ్లిపోయాడు. దీంతో మల్లయ్య రాత్రంతా రోడ్డుపై నానా అవస్థలు పడ్డాడు. ఆదివారం ఉదయం చుట్టుపక్కల వాళ్లు గమనించి ఆహారం, నీళ్లు అందించారు. కానీ కుమారులకు విషయాన్ని తెలియజేయలేదు.

ALSO READ:  ‍‍‍‍Why Young Working People Back Pain Lead To Spine Surgery?

సోమవారం రంగంలోకి దిగిన హైదరాబాద్ న్యూస్ప్రతినిధులు ముగ్గురు కొడుకులకు సమాచారం అందించారు. అందరినీ వనస్థలిపురం రప్పించారు. అనంతరం వారితో మాట్లాడి మల్లయ్యను గణేశ్ ఇంట్లోకి చేర్చారు. గతంలో ఇలా ఎప్పుడూ జరుగలేదని, ఇకపై కంటికి రెప్పలా కాపాడుకుంటామని వారు చెప్పారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, ఇకపై ఇబ్బంది కలుగనీయమన్నారు. రోజంతా రోడ్డుపై ఉండి అవస్థలు పడి.. కొడుకు ఇంట్లోకి వచ్చిన తర్వాత మల్లయ్య ముఖంలో ఆనందం కనిపించింది. ఆయన ‘హైదరాబాద్ న్యూస్’ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. కాలనీవాసులు సైతం అభినందించారు. #KhabarLive