మాది కులాంతర, మతాంతర వివాహం… వేరు వేరు సామాజిక నేపథ్యాలు ఉన్న మాలో ఒకరు మతాన్ని నమ్మినా, మరొకరు ఏ మతాన్ని నమ్మకున్నా మా పిల్లల విషయంలో మేము ఎటువంటి కుల, మత విశ్వాసాలను అనుసరించడం లేదు..
అయితే స్కూల్ అప్లికేషన్‌లో తప్పనిసరిగా మతం, కులం రాయాలని అన్నప్పుడు మా పోరాటం మొదలయింది. కులమతాలకు వెలుపల మనుషుల అస్తిత్వ ప్రకటనకు ప్రస్తుతం అవకాశం లేదు. అలాంటి అవకాశం ఉండాలని మేము ఏప్రిల్ 2010లో పౌరహక్కుల సంఘం నాయకులు, న్యాయవాది, మిత్రులు డి. సురేష్ కుమార్ సహకారంతో హైకోర్టును ఆశ్రయించాం. ‘మతం నమ్మడానికి హక్కు ఉందంటే నమ్మకుండా ఉండడానికీ హక్కున్నట్లే’ అని హైకోర్టు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
మా చిన్న అమ్మాయి సహజ స్కూల్ ప్రవేశమప్పుడు మొదలయిన ఈ సమస్య, మళ్లీ మా పెద్ద అమ్మాయి స్పందన 10వ తరగతి ఆన్‌లైన్ అప్లికేషన్‌లోనూ ఎదురయింది. అప్పుడు మార్చి, 2017లో ఏదీ పాటించని మాలాంటివారికి మత రహితం, కులరహితం అని ప్రకటించుకునే అవకాశం ఉండాలని హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాం. హైకోర్టు మా వ్యాజ్యాన్ని స్వీకరించి– దీనిపై రెండు వారాల్లో జవాబు ఇవ్వమని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఇంతవరకు ప్రభుత్వాల నుంచి ఏ జవాబూ లేదు. మా ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో డెమొక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డి.టి.ఎఫ్) మాకు మద్దతుగా ఇంప్లీడ్ అయింది.
ప్రజల మద్దతు కూడగట్టడంలో భాగంగా మేం ఆన్‌లైన్ సంతకాల సేకరణ చేపట్టాం. సంతకాల కోసం చేంజ్ డాట్ ఆర్గ్‌లో మేము పెట్టిన పిటిషన్‌పై మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి, అనేక దేశాల నుంచి అనేక మంది సంతకాలు చేశారు. ఈ ప్రకటన పంపే సమయానికి మొత్తంగా 5254 మంది సంతకాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. మేము ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి సంవత్సరం కావస్తున్నా ప్రభుత్వాల నుంచి ఎటువంటి స్పందనా లేదు.
మతరహిత – కులరహిత అస్తిత్వ ప్రకటనకూ అవకాశం ఇవ్వమని ప్రభుత్వాలపై మనమే ఒత్తిడి తేవాలి. ఎప్పటి నుంచో మనుషులకు మత స్వేచ్ఛ ఉంది. ఇప్పుడిక ఏ మతం నమ్మని వాళ్ల స్వేచ్ఛకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా పిటిషన్ చదివి మీరు సంతకం చేస్తారని ఆశిస్తున్నాం. మా పిటిషన్‌లోకి మీరు ఇలా వెళ్లొచ్చు– గూగుల్ సెర్చ్‌లో ‘‘No Religion No Caste Change dot org petition’’ అని టైప్ చేస్తే మా పిటిషన్ లింక్ కనబడుతుంది. ఆ లింక్‌ను క్లిక్ చేసి మా విజ్ఞప్తిని చదవొచ్చు. చదివి సంతకం చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మా చేంజ్ డాట్ ఆర్గ్ పిటిషన్ లింక్‌ను కాపీ చేసి మీ మెయిల్స్, వాట్సాప్, ఫేస్‌బుక్ మాధ్యమాలలో సంతకాల కోసం మీ మిత్రులతో విస్తృతంగా పంచుకుంటారని ఆశిస్తున్నాం. ఈ ప్రజాస్వామిక ఆకాంక్షకు మీ వంతు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. #KhabarLive