“ఆరోజు 2017 ఫిబ్రవరి 21వ తేదీ.. రాత్రి పది అయింది. పదకొండు అయింది. ఆ సమయంలో హైదరాబాద్ నగరం మెల్లమెల్లగా నిద్రలోకి జారిపోతున్నది. తర్వాత అర్ధరాత్రి 12 అయింది. అప్పుడు క్యాలెండర్ లో డేట్ మారింది. 22వ తేదీలోకి ఎంటర్ అయ్యాము. అప్పుడు తెల్లారుగట్ల 3 గొట్టంగ తార్నాక ఏరియాలో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా అలజడి రేగింది. వందల సంఖ్యలో పోలీసు బలగాలు ఒక ప్రొఫెసర్ ఇంటిమీద ఎగబడ్డాయి. తలుపులు బద్దలు కొట్టి ఆ ప్రొఫెసర్ ను అరెస్టు చేశాయి పోలీసు బలగాలు. ఆ ఇల్లు ఎవరిదో కాదు.. తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం దే. ఆయనను తెల్లారుగట్ల 3 గంటలకు అరెస్టు చేసి అక్కడి నుంచి కామాటిపురా పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆయనతోపాటు జెఎసి మద్దతుదారులను సైతం అరెస్టు చేశారు. ఆ రాత్రి ఏకంగా వేల సంఖ్యలో జెఎసి ప్రతినిధులను తెలంగాణ అంతటా అరెస్టు చేసి నిర్బంధ కాండ కొనసాగించారు.”
ఆ ఘటనకు మరికొద్ది గంటల్లో ఏడాది నిండబోతున్నది. అప్పటి వరకు తెలంగాణలో ఏకపక్షంగా ఉన్న తెలంగాణవాదులు రెండు వర్గాలుగా చీలిపోయారు. కేసిఆర్ అనుకూల వర్గం, కేసిఆర్ వ్యతిరేక వర్గంగా చీలిక వచ్చింది. ఆ క్షణం వరకు కోదండరాం కు పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదు. ఆయన పార్టీ పెట్టాలన్న వత్తిడి కూడా జనాలు తేలేదు. కానీ.. ఆ తెల్లారుగట్ల 3 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టిన వేళ కోదండరాం మదిలో రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనైతే కలిగిందని జెఎసి నేతలకు తెలిసింది. తెల్లారితే ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపట్టేందుకు జెఎసి సమాయత్తమైతున్న సందర్భంలో కోదండరాంను అరెస్టు చేసి ఆ ర్యాలీని సమర్థవంతంగా భగ్నం చేసింది కేసిఆర్ సర్కారు.
ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఏనాడైనా ఉద్యమ కాలంలో కోదండరాం ను ప్రొఫెసర్ గానే గౌరవించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సర్కారు మాత్రం కోదండరాం ను ఒక శత్రువుగా.. తెలంగాణ ద్రోహిగా పరిగణించి అవమానాలపాలు చేసింది. అరోజు తెలంగాణ సర్కారు మీద వ్యతిరేకత లెవల్స్ పెరిగిపోయిన పరిస్థితి ఉంది. అప్పటినుంచి నిరుద్యోగ ర్యాలీ కోసం జెఎసి చేయని ప్రయత్నం లేదు. అంతిమంగా కోర్టుల్లో కొట్లాడి.. సర్కారుకు మొట్టికాయలు వేయించి మరీ అనుమతి తెచ్చుకుని మొన్న మొన్న కొలువులపై కొట్లాట సభను జరిపి నిరుద్యోగ తీవ్రతను ప్రపంచానికి చాటింది జెఎసి.
నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఒక్క దెబ్బకే లక్ష కొలువులిస్తానని తీపిమాటలు చెప్పిన ఉద్యమ నేత కేసిఆర్ గద్దెనెక్కిన తర్వాత ఆ మాటలు మరచిపోయి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న సందర్భాన్ని జెఎసి గుర్తు చేస్తున్నది. అందుకే జెఎసి నిరుద్యోగుల తరుపున నిలబడి కొట్లాడింది. అంతిమంగా కొలువులకై కొట్లాట సభ పెట్టి సర్కారుకు గట్టి హెచ్చరికలు పంపింది. కొలువులకై కొట్లాట సభ రోజు కూడా కోర్టు ఆదేశాలు ధిక్కరించిన పోలీసులు అడుగడుగునా నిర్బంధం ప్రయోగించి జనాలు, యువత హైదరాబాద్ పొలిమేరలకు రాకుండా అడ్డుకట్ట వేశారు. అయినా సభ జరిపింది జెఎసి.
ఇక కోదండరాం ఇంటి తలుపులు బద్ధలుకొట్టిన ఘటన జరిగి ఏడాది గడుస్తున్న వేళ ఫిబ్రవరి 22,23 తేదీల్లో (ఈ ఏడాది) నిరుద్యోగ సమస్యను మరోసారి తెలంగాణ సమాజం ముందుకు తేవడం కోసం జెఎసి నడుం బిగించింది. పోస్టు కార్డు ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈనెల 22, 23 తేదీల్లో లక్షలాది మంది నిరుద్యోగ యువత తెలంగాణ సిఎం కేసిఆర్ కు పోస్టు కార్డులు రాసి నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. ఉద్యోగాల ముచ్చటే మరచిపోయిన సర్కారు మొద్దు నిద్ర మత్తును వదిలించేందుకు ఈ ఉద్యమాన్ని చేపట్టినట్లు జెఎసి నేతలు ప్రకటించారు.
పోస్టు కార్డులో ఉండే మ్యాటర్ ఇది”
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం, సీ.ఎం.క్యాంపు ఆఫీస్, పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీ, గ్రీన్ ల్యాండ్స్, హైదరాబాద్, తెలంగాణ-500082
నిరుద్యోగ సమస్య పరిష్కారానికై ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ద్వారా విజ్ఞప్తి:
గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్రాయునది.
నిరుద్యోగ సమస్య ప్రధానాంశంగా తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని వందలాది మంది యువతీ,యువకులు బలిదానాలు చేశారు. కానీ తెలంగాణా వచ్చిన తరువాత పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. నిరుద్యోగ యువత పూర్తి నిర్లక్షానికి గురవుతున్నారు. పట్టభద్రులైన నిరుద్యోగ రేటు విషయంలో దేశంలో అస్సాం ,జమ్ము కాశ్మీర్ తరువాత మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది.
సమస్య తీవ్రతను గుర్తించి పరిష్కారానికి దిగువ చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
1 .ప్రభుత్వంలో ,ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న ఖాళీలు తక్షణం ప్రకటించాలి.
2 .ఖాళీలను కుదించే ప్రయత్నాన్ని విడనాడాలి.
3 .ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండరు విడుదల చేయాలి.
4 .స్థానిక పరిశ్రమలలో ఉద్యోగాలను స్థానికులకే రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.
5.నిరుద్యోగ భృతి కల్పించాలి.
సత్వరమే పై విషయములపై కార్యాచరణ ప్రకటించాలని కోరుతున్నాం. ఇది నా స్వదస్తూరితో రాసిన లేఖ. — తెలంగాణ నిరుద్యోగి.