తెలంగాణలో టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు యధావిధిగా జరుగుతాయి, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ప్రైవేట్ డిగ్రీ & పీజీ, ఇంటర్ కాలేజీలు, పాఠశాలల మేనేజ్ మెంట్ల జేఏసీ నేతలు స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయడం మంచిది కాదని, విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సహకరిస్తున్నామని తెలిపారు.

ఈ మేరకు నేడు సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చాంబర్లో ప్రైవేట్ డిగ్రీ& పీజీ, ఇంటర్ కాలేజీలు, పాఠశాలల జేఏసీ నేతలు సమావేశమయ్యారు. వారి సమస్యలను ఉఫ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం సచివాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ, పీజీ విద్యార్థులు ఎక్కువగా చదువుతున్న ప్రైవేట్ రంగంలో ఫీజు రియింబర్స్ మెంట్ కోసం కేవలం 400 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని, అందుకే ఈ మొత్తాన్ని నాన్ ప్రొఫెషనల్ కాలేజీలకు ప్రత్యేక పద్దు కింద విడుదల చేయాలని, ఈ మేరకు బడ్జెట్ లో వేర్వేరు కేటాయింపులు చేయాలని కోరారు. దీనికి డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అదేవిధంగా దోస్త్ అడ్మిషన్లను ఉమ్మడిగా చేపడుతున్నప్పటికీ ఆయా యూనివర్శిటీల కింద బోధనా ఫీజులు వేర్వేరుగా ఉన్నాయని, ఉమ్మడి అడ్మిషన్ల నేపథ్యంలో ఫీజులను కూడా ఉమ్మడిగా నిర్ణయించాలని కోరినట్లు తెలిపారు.

ALSO READ:  ‍‍‍Why 'Hinduvta Strategy' Failed On 'Dalits Attacks' In Telangana?

మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్ కింద భర్తీ చేసుకునేందుకు అనుమతించాలని కోరామన్నారు. ట్యూషన్ ఫీజును ఏటా పది శాతం పెంచాలన్న దానిని అమలు లోకి తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. వీటన్నింటిని పరిష్కరిస్తామని, 15 రోజుల తర్వాత అధికారులు, జేఏసీ నేతలతో సంయుక్త సమావేశం పెట్టి చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చినట్లు డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందర్ రాజు, నేతలు పరమేశ్వర్, ప్రకాశ్, శ్రీనివాస్ తెలిపారు.

ఇంటర్మీడియెట్ కాలేజీలకు సంబంధించి అఫ్లియేషన్ లో చాలా సమస్యలున్నాయని, వీటిని ఉప ముఖ్యమత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ కోర్ కమిటీ సభ్యులు కె. సిద్దేశ్వర్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ అఫ్లియేషన్ సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారన్నారు. అదేవిధంగా ట్యూషన్ ఫీజును 40 శాతం పెంచాలని అడగగా…50 శాతం పెంచేందుకు ఉప ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. దీంతో ప్రభుత్వానికి తాము పూర్తి స్థాయిలో పరీక్షల నిర్వహణలో సహకరిస్తామని చెప్పారు.

ALSO READ:  The Magic Of Couture Of 'My Expression, My Pride' In 'Hi-Life Exhibitions'

పక్కా భవనాలున్నచోట ప్రతి సంవత్సరం పాఠశాలలను రెన్యువల్ చేసుకోవడం కాకుండా ఒకేసారి రెన్యువల్ చేసే విధానాన్ని కల్పించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కోరినట్లు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకునే విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించారన్నారు. తెలుగు మీడియం పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మార్చుకోవడం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని, ఇంకా ఏమైనా సమస్యలుంటే వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు ఏవైనా కారణాల వల్ల ఫీజు చెల్లించని పక్షంలో యాజమన్యాలుగా తాము ఏం చేయాలో కూడా ప్రభుత్వమే జారీ చేసే జీవోలో సూచించాలని కోరినట్లు చెప్పారు. డిగ్రీ, ఇంటర్, పాఠశాలల మేనేజ్ మెంట్ల జేఏసీలు కోరిన వాటిపట్ల ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వంతో కొట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని, ఈ సందర్భంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని భావించామని, అందుకే పరీక్షలు యధావిధిగా జరిగేలా ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ALSO READ:  Did The Moghal Ruler's 'Queen Bhagmati' Really 'Exist' In Hyderabad Dynasty?

పరీక్షల నిర్వహణలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని మైనారిటీ విద్యా సంస్థలన్నీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి హామీ ఇచ్చాయి. ఈమేరకు ఆయా కాలేజీల పేర్లతో కూడిన జాబితాను జత చేసి రాతపూర్వకంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి లేఖ అందించాయి. మొదటి నుంచి కూడా తాము పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేసే చర్యలకు వ్యతిరేకమని ఆయనకు స్పష్టం చేశాయి.

విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని వారిని ఆందోళనకు గురి చేయకుండా పరీక్షల నిర్వహణలో సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జేఏసీ నేతలను కోరారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే చాలా సామరస్యంగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని అయినా కూడా పరీక్షలను బహిష్కరిస్తామనే ధోరణి మంచిది కాదన్నారు. ఇప్పటికైనా పరీక్షలకు సహకరిస్తామని ముందుకు రావడం పట్ల కాలేజీలు, పాఠశాలల యాజమాన్యాల జేఏసీకి ఆయన కృతజ్ణతలు తెలిపారు. #KhabarLive