మ్మ కాని అమ్మ…. మిత్తమ్మ! అయ్య కాని అయ్య మిత్తయ్య!… చుట్టరికం కాని చుట్టరికం మిత్తరికం. వందల సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో ఈ మిత్తరికం సంప్రదాయం కొనసాగుతోంది. రక్తసంబంధం కంటే ఎక్కవగా ‘నేస్తరికానికి’ వాళ్లు ఎందుకు విలువనిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది..

బంధాలు.. బంధుత్వాలు పేరుకి మాత్రమే అనుకునే పట్టణాలు, నగరాలు గురించి కాదు. స్వచ్ఛమైన పల్లె మాట చెప్పుకొందాం ఇప్పుడు. మీ ఇంట్లో పెళ్లి. లేదా మరో ముఖ్యమైన కార్యక్రమం. బంధువులు, రక్తసంబంధీకులే నాలుగు రోజులు ముందొచ్చి పనులన్నీ చక్కబెట్టుకుంటారు. తక్కిన వాళ్లు ఆరోజు చుట్టపు చూపుగా వచ్చి ఓ నవ్వునవ్వి పలకరించి వెళ్లిపోతారు. మనం ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు వెళితే ఇందుకు పూర్తిగా భిన్నమైన సంప్రదాయం ఒకటి కనిపిస్తుంది. నాలుగు రోజులు ముందే వచ్చి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టే ఆ ఆత్మీయ బంధువులు..

రక్తసంబంధీకులు కాదు మిత్తరికం చేసిన కుటుంబ సభ్యులంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ మాటకొస్తే వాళ్లది ఒక్క కులం కాదు.. ఒక్క ప్రాంతం కాదు. భిన్నమైన జీవనశైలి నుంచి వచ్చిన ఆ కుటుంబాలు ఎలా ఒక్క కుటుంబంలా కలిసి ఉంటారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పెళ్లికి వచ్చిన పొరుగు జిల్లాల వారికి ఈయన ‘మా మావయ్య’ ఆమె ‘మా అత్తయ్య’ అని పరిచయం చేసినట్టుగానే ఆమె ‘మా మిత్తమ్మ’, ‘మిత్త బావ’, ‘మిత్త అక్క’ వంటి బంధుత్వాలు అక్కడే మనకి పరిచయం అవుతాయి. వాస్తవానికి వాళ్లు ఎవరూ రక్తసంబంధీకులు కాదు కానీ అంతకంటే ఎక్కువే. స్థానికంగా ఈ సంప్రదాయాన్ని మిత్తరికం లేదా నేస్తరికం అనీ అంటారు.

ALSO READ:  The Importance Of Banana And Tree In The Lives Of Telugu People

పెళ్లి, పేరంటాలప్పుడే కాదు… కష్టంలో కూడా రక్తసంబంధీకుల రాక ఎంత ముఖ్యమో వీళ్ల రాక అంతేముఖ్యం. వీళ్ల కుటుంబంలో వాళ్లని.. వాళ్ల కుటుంబంలో వీళ్లని వేరుచేసి చూడరు. ఒకరికొకరు పొరపాటున కూడా ఒక్కమాట అనుకోరు. గౌరవం ఇచ్చిపుచ్చుకుంటారు. ఒకరు ఇంకొకరి ఇంటికి వచ్చేటప్పుడు ఉత్తచేతులతో రారు. వాళ్ల ప్రాంతంలో పండే వస్తువులని వెంట తెస్తారు. అంతకుమించి కష్టంలో, కన్నీళ్లలో తోడుగా, అండగా ఉంటారు. ఉత్తరాంధ్ర చాలా ప్రాంతాల్లో ఈ సంస్కృతి కనిపించినా శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా నేస్తరికం చేసే చిన్నారి జంటలతోపాటు పాతతరం నేస్తాలు మనకిక్కడ కనిపిస్తారు.

ఒక్కసారి నేస్తరికం చేస్తే…
శ్రీకాకుళం ప్రాంతాన్ని పల్లం, మైదానం, ఉద్దానం, గిరిజన ప్రాంతాలుగా విభజించి చూస్తే.. ఉద్దానం చక్కటి మత్య్స సంపద ఉన్న సముద్రతీర ప్రాంతం. జీడిమామిడి, కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి. మైదానంలో వరి, మినుము, మిరప, పెసర

తదితర పంటలు పండుతాయి. తూర్పు కనుమలు దట్టంగా అల్లుకున్న గిరిజన పల్లెలు అయితే విలువైన ఔషధాలకి, అటవీ ఉత్పత్తులకు పెట్టింది పేరు. ఈ మూడు ప్రాంతాల అవసరాలు వేర్వేరు. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడానికి ఈ మిత్తరికం బలమైన పునాది వేసింది. అదెలా అంటే.. ఉద్దాన ప్రాంతంలో పండిన జీడి, మామిడి పంటలు మైదానంలో విక్రయించి అక్కడ దొరికే ధాన్యం, బియ్యం వంటి ఇతర ఉత్పత్తులు పట్టుకెళ్లాలి. నోట్లు అంత ఎక్కువగా అందుబాటులో లేని తొలి నాళ్లలో వస్తు మార్పిడి విధానమే ఎక్కువగా ఉండేది.

ALSO READ:  Meet The Renowned Painter Who Is Representing Hyderabad In World Art Fairs

వాళ్ల వాళ్ల వ్యాపారాలు చేసుకోవడానికి నమ్మకమైన నీడ కావాలి కదా… అలా ఉద్దానం వాళ్లు మైదానం వాళ్లతో, గిరిజనులు ఇతరులతో స్నేహం చేయడం మొదలుపెట్టారు. అలా మిత్తరికాలు మొదలయ్యాయి. కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లోనూ ఆ స్నేహాలు ఇంకా మునపటిలానే కొనసాగుతున్నాయి. అయితే గిరిజనులు అంత త్వరగా ఎవ్వరినీ నమ్మరు.. నమ్మితే ప్రాణం పెడతారు. నీళ్లతో చేతులు ఉంచి ‘నేను నీ నేస్తాన్ని’ అని మనస్ఫూర్తిగా ఒక్కసారి చెప్పుకొంటే ఆ స్నేహ బంధం కొన్ని తరాల వరకూ కొనసాగుతుంది. ఒకరి ఇంట్లో ఒకరు సొంత మనుషుల్లా మారిపోతారు. అమ్మ నాన్న, తర్వాత…మిత్తమ్మ, మిత్తయ్యలనే బంధం పెనవేసుకుంటుంది.

తరాలు మారినా ఇప్పటికీ కల్మషం లేని, స్వచ్ఛమైన ఆ స్నేహాలు మనకి చాలా కుటుంబాల్లో కనిపిస్తాయి. వ్యవసాయ పనులు అప్పుడు, శుభ, అశుభ కార్యాలప్పుడు.. ఈ కుటుంబాలు తప్పనిసరిగా కలుసుకుంటాయి. తాతముత్తాల నుంచీ ఈ స్నేహాలను కాపాడుకుంటున్న ఆనవాయితీ ఇక్కడ వస్తూ వచ్చింది. ఉద్దానం నుంచి వచ్చేవాళ్లు వస్తూవస్తూ కొబ్బరికాయలు, జీడిపిక్కలు, నాటుకోళ్లు, అరటిఆకులు తెస్తే… వాళ్లను ఉట్టిచేతులతో పంపకుండా పల్లం నుంచి ధాన్యం, బియ్యం, చింతపండు వంటివన్నీ ఇచ్చి సంతృప్తిగా సాగనంపుతారు మైదానం వాళ్లు. గిరిజనులతోనూ ఇలానే ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఉంటుంది.

నీటిముల్లు… సంపంగి
‘నీటిముల్లూ బాగున్నావా? బాగున్నా. నువ్వెలా ఉన్నావ్‌ గాదె’… ఈసంభాషణలో నీటిముల్లు, గాదె అనేవి ఒకరినొకరు పిలుచుకునే పేర్లు అని తెలిస్తే కానీ కొత్తగావచ్చిన వాళ్లకి ఆ సంభాషణ ఏంటో కూడా అర్థంకాదు. నీటిముల్లు అంటే నీటిలో తిరిగే ఒక రకం పురుగు. గాదె అంటే ధాన్యం గాదె. ప్రకృతికి దగ్గరగా ఉండే అనేక వస్తువుల పేర్లను ఈ నేస్తరికం చేసిన వాళ్లు తమ నేస్తాలకు పెట్టుకుంటారు. శ్రీకాకుళం జిల్లాలోని మందస, మకరజ్వాల, డబారు, బుడార్‌సింగి, ఉమాగిరి, రట్టి, బైరిసారంగపురం, పుచ్చపాడు, గంగువాడ వంటి ప్రాంతాల్లో ఇలాంటి చిత్రమైన పేర్లు కనిపిస్తాయి. చామంతి, నేరేడుపండు, చిలుక వంటివి నేస్తాల పేర్లే.

ALSO READ:  Do You Know The 'Secrets Of Hyderabad'?

అవన్నీ వాళ్ల అసలు పేర్లు కావు. నేస్తం మరొక నేస్తానికి పెట్టిన పేరు. పెద్దల వాళ్ల నుంచి వచ్చిన మిత్తరికం బంధాన్ని కాపాడుకుంటూనే .. చిన్నపిల్లలు, వయసొచ్చిన పిల్లలు కూడా ఒకరితో ఒకరు కొత్త ‘నేస్తరికాలని’ మొదలుపెడతారు. ఒక అమ్మాయి మరొక అమ్మాయితో నేస్తరికం చేసినప్పుడు ముద్దుగా ప్రకృతితో ముడిపడిన పేరుని తన నేస్తానికి పెట్టడం ఇక్కడి ఆచారం. నేరేడుపండు, చామంతి, చిలుక వంటి పేర్లు ఆ కోవకే చెందుతాయి. కాలక్రమంలో సొంతపేర్లు పోయి ఈ పేర్లే స్థిరపడినా ఆశ్చర్యపోనవసరం లేదు. అన్నదమ్ములు, అక్కచెల్లెలు వరస అవ్వాలనుకుంటే ‘నేస్తరికం’ చేస్తారు. అదే బావబామ్మర్ది వరస అవ్వాలనుకుంటే ‘మొకర కట్టడం’ అని అంటారు.

నీలధార పండగలు…
గిరిజనులు తరుచుగా దళారుల పాలపడి మోసపోయేవారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గిరిజనుల సంపద దళారుల పాలపడకుండా అప్పట్లో నక్సల్స్‌ ‘నీలధార పండగలని’ నిర్వహించేవారు. నీళ్ల కింద చేతులు పెట్టి దోస్తీ కట్టి గిరిజనులతో స్నేహం చేసి వారి అటవీ ఉత్పత్తులు గిట్టుబాటు ధరలు వచ్చేలా చూసేవారట. సవర్లు, బగతలు వాల్మీకులు ఈ నీలధార పండగల్లో ఎక్కువగా పాల్గొనేవారు. #KhabarLive