ప్రాజెక్టు ఎన్నెన్నో విశిష్టతలకు నెలవు. ఆ ప్రాజెక్టు పనుల్లోనూ, వాటి వేగంలోనూ అంతే ప్రత్యేకతలు. వేల మంది కార్మికులు, ఇంజినీర్లు అక్కడ నిరంతరం శ్రమిస్తున్నారు. భారీ యంత్రాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. రోజువారీ పర్యవేక్షణలు, తరచూ సమీక్షలతో.. తెలంగాణ ప్రభుత్వం పనుల్ని పరుగులు పెట్టిస్తోంది. నీటికి సరికొత్త నడకను నేర్పి.. పంటపొలాల్ని సస్యశ్యామలం చేయడానికి చేపట్టిన ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం’ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పథకాన్ని సాధ్యమైనంత త్వరగా ఆచరణలోకి తేవడం కోసం సర్కారు అహరహం శ్రమిస్తోంది. నిధులకు ఇబ్బంది లేకుండా చూస్తోంది. పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాకుండా సమాంతరంగా, చురుగ్గా కొనసాగుతున్నాయి.

రోజూ సరాసరిన 25 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరుగుతోంది. గేట్ల తయారీ ముమ్మరమైంది. పంపులు, మోటార్లు అమర్చే పనుల్లో వేగం పుంజుకుంది. ఇదే రీతిలో కొనసాగితే మరో నాలుగు నెలల్లో.. వచ్చే ఖరీఫ్‌లో కొంత నీటినైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి, అక్కడ్నుంచి మధ్యమానేరుకు మళ్లించే అవకాశం ఉంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పనుల పురోగతిని రోజువారీ సమీక్షిస్తున్నారు. ప్రతివారం లేదా వారానికి రెండుసార్లు నేరుగా పనుల వద్దకు వెళ్తున్నారు.

ALSO READ:  9కోట్ల ఆఫీసు స్థలం 3-4లక్షల నివాసాలు, రియల్ రంగానికి పెరిగిన ఆదరణ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరచూ ఉన్నతస్థాయిలో సమీక్షలు జరుపుతున్నారు. ఎలాగైనా ఖరీఫ్‌లో మధ్యమానేరుకు నీటిని మళ్లించాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం దీనికి తగ్గట్లుగా గుత్తేదార్లు, ఇంజినీర్లు, రెవెన్యూ అధికారుల్ని పరుగులు పెట్టిస్తోంది. అన్ని బ్యారేజీల్లో గేట్లు తయారీ, అమర్చడం, కాంక్రీటు పనులు, ఎలక్ట్రిక్‌ పనులు జరుగుతున్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతున్నా… వేలమంది కార్మికులు చెమటోడ్చి పనిచేస్తున్నారు. ఒక్కో ప్యాకేజీలో 2000 నుంచి 2500 మంది వరకు కూలీలు పనుల్లో నిగమ్నమై ఉన్నారు. ఈ ఏడాది ఆఖరుకు మేడిగడ్డ మినహా మిగిలిన పనులు దాదాపు పూర్తిస్థాయిలో సిద్ధ్దమయ్యే అవకాశం ఉంది.

గత ఏడాది ఆగస్టు 15, 16 తేదీల్లో కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఈనాడు’ సందర్శించి.. పనుల తీరును పరిశీలించింది. అప్పట్లో బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మరోమారు ప్రాజెక్టును ఈనాడు సందర్శించింది. ఆగస్టు నుంచి ఇప్పటిదాకా 8 నెలల్లో ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్ల వరకు ఖర్చుచేసింది. ప్రస్తుతం దాదాపు 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయి.

ALSO READ:  Where Is The 'Real Estate Act' in Telangana?

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన బ్యారేజీలు, ఎత్తిపోతలు, కాలువల నిర్మాణాలు, డెలివరీ సిస్టెర్న్‌లు.. ఇలా అన్ని నిర్మాణాలూ శరవేగంగా, సమాంతరంగా సాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో కార్మికులు శ్రమిస్తున్నారు. భారీ యంత్రాలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయి. #KhabarLive