ప్రపంచాన్ని నిశ్శబ్దంగా చుట్టుముట్టిన ఉపద్రవం హైపర్‌టెన్షన్. కానీ ఈ విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు. అందుకే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రజలను మేల్కొలిపే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. హైపర్‌టెన్షన్ పట్ల యువతలో అవగాహన కల్పించే బాధ్యత వైద్యుల పై ఉంచింది. ప్రపంచంలో అకాల మరణాలకు కారణమైన రిస్కుల్లో హై బిపి ఒకటి. ఏటా 90 లక్షలమంది దీని ప్రభావంతో మరణిస్తున్నారు. సిస్టాలిక్ సంఖ్య 140 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా లేదా డయాస్టాలిక్ సంఖ్య 90 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నా హైబిపి ఉన్నట్టే అంటున్న కాంటినెంటల్ హాస్పిటల్స్ డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎం.డి(జనరల్ మెడిసిన్)తో మాటామంతీ…

హైపర్ టెన్షన్ ప్రభావం ఎలా ఉంటుంది. దీన్నిగుర్తించడం ఎలా?
ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి రక్తపోటు ఎక్కువగానే ఉంటుంది. ఆ విషయం వారిలో చాలామందికి తెలియదు. రక్తపోటు చాలా ఎక్కువగా ఉన్నా ఎటువంటి లక్షణాలు కనబడవు. దీంతో చాలామందికి తమకు రక్తపోటు ఉందన్న విషయం ముందుగా తెలియదు. కానీ, ఎప్పుడో ఒకసారి హఠాత్తుగా గుండెపోటు, పక్షవాతం, కిడ్నిల వైఫల్యం వంటి తీవ్రస్థాయి దుష్ప్రభావాల బారినపడి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. హైబిపి ఉన్నా పట్టించుకోకుంటే గుండె లయతప్పడం, గుండె వైఫల్యం చెందడం, కిడ్నీలు విఫలమైపోయే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటుకు మధుమేహం తోడైతే ప్రమాదం తీవ్రత పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ హైబిపిఉందా, అసలు బిపి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి తరచుగా పరీక్షలు చేయించుకోవాలి.

ALSO READ:  TRS Shining In South Telangana Reflect In TRS’ Fortunes In Poll 2018

వయసుతోపాటు హైబిపి పెరుగుతుందా?
అవును. వయసు పెరుగుతున్న కొద్దీ హైబిపి ముప్పు పెరుగుతుంది. 20 నుంచి 30 సంవత్సరాల్లో ఉన్న వారికి ప్రతి పదిమందిలో ఒకరికి హైబిపి ఉంటే.. 50 ఏళ్లు వచ్చే సరికి ప్రతి పదిమందిలో ఐదుగురికి హైబిపి ఉంటుంది. చాలామంది హైబిపి లాంటి సమస్యలు సంపన్న దేశాలవనుకుంటారు. కానీ, నిజానికి పేదలు ఎక్కువగా ఉండే దేశాల్లో హైబిపి ఎక్కువగా ఉంటుంది. ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో 40శాతం పైగా దీని బారినపడటమే ఇందుకు ఉదాహరణ. ప్రపంచీకరణ పెరుగుతున్న కొద్దీ చాలా దేశాల్లో హైబిపి సమస్య కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రజల జీవనశైలి అనారోగ్యకరంగా మారిపోతుంది. హైబిపి ఇప్పుడు చాలా సర్వసాధారణమైన సమస్యగా మారింది. అలాగే హైబిపి ఉంద ని తెలిసినా చాలామంది సరైన చికిత్స తీసుకోవడం లేదు.

ఎలా చెక్ చేసుకోవాలి. వైట్ కాలర్ హైపర్ టెన్షన్ అంటే..
-కొన్నిసార్లు డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు బిపి పెరుగుతూ, తర్వాత ఇంటివద్ద చూసుకుంటే చాలా తక్కువగా ఉండొచ్చు. ఇలాంటి వాటిని వైట్ కాలర్ హైపర్‌టెన్షన్ అంటారు. ఎవరైనా రోగి ఇలా చెబుతుంటే దాన్ని తేలికగా తీసుకుని వదిలెయ్యకూడదు. బిపిలో హెచ్చుతగ్గులు, మార్పు లు ఎక్కువగా కనబడుతుంటే రోజంతా బిపిని నమోదు చేసే యాంబ్యులేటరీ మానిటరింగ్ చేయాలి.

ALSO READ:  తెలంగాణ జన సమితి, కోదండరాం కొత్త పార్టీ ఇది, ఏప్రిల్‌ 2న అధికారికంగా ప్రకటన

బిపికి మందులు ఎప్పుడు వేసుకోవాలి?
బిపి మరీ ఎక్కువగా లేకపోతే మొదటిసారి మందులు ఆరంభించాల్సిన అవసరం లేదు. రోగిని మరో రెండు మూడుసార్లు చెక్ చేసిన తర్వాత బిపి ఏ మాత్రం తగ్గకుండా ఉంటే అప్పుడు మందులు ఉపయోగించాలి. ఎందుకుంటే ఒకసారి మందులు వేసుకోవడం ప్రారంభిస్తే చాలాకాలం వాటిని వేసుకోవాలి. వెంటనే మందుల మోతాదు తగ్గించలేం. మందులు వేసుకోవడం ఆరంభించిన తర్వాత బిపి కచ్చితంగా నియంత్రణతో ఉంటుందా లేదా చెక్ చేయడం అవసరం. ఏదో ఒక స్థాయిలో కొద్దిగా తగ్గింది కదా అని వదిలెయ్యకూడదు. మందులు వేసుకోవడం ప్రారంభించిన తర్వాత 130/80 కి ఎంత దగ్గరలోకి తీసుకురాగలిగితే అంత మంచిది. మధుమేహం, మూత్రపిండాల జబ్బులు ఉంటే బిపి తప్పనిసరిగా 120/80 కంటే తక్కువే ఉండేలా చూసుకోవాలి.

హైబిపి ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మందులు వేసుకుంటున్నాం కదా అని జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అటు మందులు, ఇటు జీవనశైలిలో మార్పులు రెండు కలిపి చూస్తేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఉప్పు తగ్గించాలి. వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

మందుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బిపి నియంత్రణలోకి తెచ్చేందుకు ఒకే మందును ఎక్కువ మోతాదులో ఇచ్చేకంటే.. ఒకటి కంటే ఎక్కువ మందులను తక్కువ మోతాదులో సూచిస్తాం. ఈ విధానం వల్ల బిపి కంట్రోల్‌లో ఉండడంతో పాటు వారి కి సైడ్ ఎఫెక్ట్ రాకుండా నివారించవచ్చు. మందులు వాడుతూ ఫలితాలను గమనించాలి. ఎలాంటి మార్పు రాకుంటే మందుల మోతాదును పెంచుతూ పోయే కంటే అవసరాన్ని బట్టి కొత్తవాటిని జోడించడం మంచిది. రెండు మూడు రకాల మందులు వాడుతున్నా బిపి తగ్గని వారిలో ఎందుకు తగ్గడం లేదన్నది లోతుగా పరిశీలించి చూడాలి. ముఖ్యంగాఉప్పు తగ్గిస్తున్నారా జీవన శైలిలో మార్పులు చేశారా ఇతర మందులు ఏమైనా వాడుతున్నారా అన్నది గమనించాలి. ఎందుకంటే అస్తమా బాధితులు, రుమటాయిడ్ ఆర్థయిటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు స్టిరాయిడ్ మందులు వాడుతుంటారు. ఇవి వాడుతున్నప్పుడు బిపి పెరిగే అవకాశం ఉంది.

ALSO READ:  ‍Will Ragtag Of Regional Parties Able To Come Together Against BJP On National Arena?

యువత ఎలాంటి జాగ్రతలు తీసుకుంటే వారిలో హైపర్ టెన్షన్ నివారించవచ్చు?
యువతలో హైపర్ టెన్షన్ రావడానికి ప్రధాన కారణం జీవనశైలిలో వస్తున్న మార్పులు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, అధిక బరువు, అల్కాహాల్ తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం తదితర కారణాలతో హైపర్ టెన్షన్ వస్తుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడే యువత మందు లు ప్రారంభించడానికి ముందే తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.బిపిని నియంత్రించలేకపోతే అప్పుడు మందులు వాడాలి.
ఎలాంటి వైద్యపరీక్షలు చేయించుకోవాలి?

కంప్లీట్ బ్లడ్ పిక్చర్, బ్లడ్ షుగర్, సెరమ్ క్రియేటెనైన్, ఇసిజి, సెరమ్ క్రియేటెనైన్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, 2 డి ఇకో పరీక్షలు చేయించుకోవాలి. #KhabarLive

SHARE
Previous articleThe ‘Kadaknath’ Black Chicken Changing Lives In Chhattisgarh
Next articlePoliticising The Indian Army Is Destroying Its Internal Fabric
A senior journalist having 25 years of experience in national and international publications and media houses across the globe in various positions. A multi-lingual personality with desk multi-tasking skills. He belongs to Hyderabad in India. Ahssanuddin's work is driven by his desire to create clarity, connection, and a shared sense of purpose through the power of the written word. His background as an writer informs his approach to writing. Years of analyzing text and building news means that adapting to a reporting voice, tone, and unique needs comes as second nature.