యావత్‌ ప్రపంచం సరిగ్గా మరో నెల రోజుల్లో.. మే 3న ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం’ జరుపు కోబోతుండగా.. మన దేశంలో పెద్ద కందిరీగల తుట్టే కదిలింది.

‘నకిలీ వార్తలు’ రాసిన విలేకరుల ‘గుర్తింపు’ రద్దు చేస్తామంటూ ఉన్నట్టుండి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చడీచప్పుడూ లేకుండా విడుదల చేసిన ఈ మార్గదర్శకాలపై మీడియా వర్గాలు భగ్గుమన్నాయి. ఇది అంతిమంగా మీడియా స్వేచ్ఛను హరించేందుకే దారి తీస్తుందని ప్రధాన స్రవంతి మీడియా మొత్తం గొంతెత్తటంతో.. చివరికి ప్రధాన మంత్రే కలగ జేసుకుని ఈ ఉత్తర్వులను ఉపసంహరింప జేశారు.

నేటి పరిస్థితుల్లో నకిలీ వార్తలను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్న మాట నిజమే అయినా.. కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రధాన స్రవంతి మీడియానే లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రయత్నాలకు దిగటం ఏమాత్రం సమర్థనీయం కాదని మీడియా వర్గాలు ముక్తకంఠంతో నిరసించాయి. ఒక రకంగా.. మీడియాపై ఈ తరహాలో ఉత్తర్వులను జారీ చేసి, వెంటనే ఉపసంహరించుకోవటం… బోఫోర్స్‌ కుంభకోణం బయటపడిన రోజుల్లో రాజీవ్‌గాంధీ ‘పరువు నష్టం బిల్లు’ తేవటానికి చేసిన విఫలయత్నాన్ని గుర్తు చేస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి నకిలీ వార్తలను అడ్డుకునే పద్ధతి మాత్రం ఇది కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ALSO READ:  ‍‍‍IPL 2021 The Most Eagerly Awaited Event In The World

ఏమిటీ ఉత్తర్వులు?
విలేకరులెవరైనా నకిలీ వార్తలు రాస్తే వాళ్ల గుర్తింపు (అక్రడిషన్‌)ను రద్దు చేస్తామని కేంద్రం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వులో పేర్కొంది. నకిలీ వార్తలపై వచ్చే ఫిర్యాదులను- పత్రికలకు సంబంధించినవైతే ప్రెస్‌ కౌన్సిల్‌(పీసీఐ), ఎలక్ట్రానిక్‌ మీడియావైతే న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ సంఘం (ఎన్‌బీఏ) 15 రోజుల్లోగా విచారించి, నిగ్గుతేలుస్తాయని పేర్కొంది. ఆ వార్తలు నకిలీవని తేలితే విలేకరి గుర్తింపును తొలిదఫా ఆర్నెల్లు, రెండోసారి అయితే ఏడాది,

మూడోసారీ
అదే తప్పు చేస్తే శాశ్వతంగా రద్దు చేస్తామని పేర్కొంది. ముఖ్యంగా ఫిర్యాదు అందిన రోజు నుంచే విలేకరి గుర్తింపును నిలిపివేస్తామని పేర్కొనటం.. తీవ్ర గందరగోళానికి దారి తీసింది.

విమర్శల తూటాలు
* విలేకరుల ‘గుర్తింపు రద్దు’ అంటూ కేంద్రం కేవలం ప్రధాన స్రవంతి మాధ్యమాల్లో ఉన్న పాత్రికేయుల మీదే కొరడా ఝుళిపించాలని నిర్ణయించిందా? అన్నది తొలి విమర్శ. ఎందుకంటే వాస్తవానికి ఇవాల్టిరోజున నకిలీ వార్తలన్నవి నానా రకాల వెబ్‌సైట్లలోనూ, సామాజిక మాధ్యమాల్లోనే విపరీతంగా రాజ్యమేలుతున్నాయి. పాత్రికేయ విలువలేవీ పాటించకుండా సాగుతున్న అరాచకాల్ని అడ్డుకోవాల్సింది పోయి.. ప్రభుత్వం ప్రధానస్రవంతి పాత్రికేయుల మీద విరుచుకుపడటమేమిటన్నది విమర్శ.
* ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వార్తలు రాసిన వారిని.. నిజాయితీ, నిబద్ధత గల పాత్రికేయులను సైతం.. నకిలీ వార్తల పేరుతో ప్రభుత్వం వేధింపులకు గురి చేయదన్న భరోసా ఎక్కడుందన్నది బలంగా వినిపించిన విమర్శ. ఈ ఉత్తర్వులు దుర్వినియోగమయ్యే అవకాశమే ఎక్కువ.
* నకిలీ వార్తలంటే ఏమిటో స్పష్టం చేయకపోవటమూ సమస్యే. దురుద్దేశంతో, తప్పని తెలిసీ- పుట్టించి, ప్రచారంలోకి తెచ్చే వార్తలనే నకిలీ వార్తలనాలి. పాత్రికేయులు ఎంత నిబద్ధంగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించినా కొన్నిసార్లు తెలియకుండా పొరపాట్లు దొర్లచ్చు. వీటిని మీడియానే స్వీయనియంత్రణ పాటిస్తూ.. వెంటనే దిద్దుకుంటుంది కూడా. ఇలాంటి వాటిని నకిలీ వార్తలనటం సరికాదన్న వాదనా బలంగా వినిపిస్తోంది.
* ప్రధాన స్రవంతి మీడియా గొంతు నొక్కేసేందుకు ఒకప్పుడు రాజీవ్‌గాంధీ తేబోయిన ‘పరువు నష్టం బిలు’్ల లాంటి ప్రయత్నమే.. ఇప్పుడు మళ్లీ జరుగుతోందని, దీన్ని మీడియా సంస్థలన్నీ కలిసికట్టుగా వ్యతిరేకించాలని సీనియర్‌ పాత్రికేయులు ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో గతంలో మీడియాకు ప్రభుత్వం సంకెళ్లు వేసేందుకు చేసిన పలు ప్రయత్నాలూ చర్చకొస్తున్నాయి.

ALSO READ:  Gandipet, Himayatsagar Flood Gates Opened, Colonies Along Musi River Flooded, Residents Decry Apathy Of Authorities In Hyderabad

పాతదే ఈ చరిత్ర!
* స్వేచ్ఛకు చీకటి: రాజ్యాంగంలోని 19వ అధికరణం స్వతంత్ర భారతంలో భావప్రకటనా స్వేచ్ఛకు బలమైన పునాది వేసింది. కానీ రాజ్యాంగంలోనే కొన్ని ‘సమంజసమైన’ సందర్భాల్లో కొన్ని నియంత్రణలుండొచ్చని పేర్కొనటం దుర్వినియోగానికి దారి తీస్తోందని ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 1970లలో ఇందిరాగాంధీ దేశంలో అత్యయిక పరిస్థితి ప్రకటించి.. వందల మంది నాయకులను నిర్బంధించటంతో పాటు.. 21 నెలల పాటు పత్రికలపై కొనసాగించిన ‘సెన్సార్‌షిప్‌’ దమనకాండను దేశం ఎన్నటికీ మర్చిపోలేదు.
* రాజీవ్‌ ‘పరువు నష్టం’ బిల్లు: 1988లో బోఫోర్స్‌ కుంభకోణం బయటపడిన రోజుల్లో పత్రికలు రాజీవ్‌ గాంధీ ప్రభుత్వాన్ని కడిగిపారేస్తూ విస్తృతంగా వార్తలు రాశాయి. దీన్ని చూసి తట్టుకోలేకపోయిన రాజీవ్‌గాంధీ మీడియాపై కత్తిగట్టినట్టు.. పాత్రికేయ స్వేచ్ఛను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ‘పరువునష్టం బిల్లు’ తీసుకువచ్చారు. ‘క్రిమినల్‌ ఉద్దేశాలతో నిందారోపణలు చేయటం, పచ్చిగా రాయటం’ వంటి నేరాలను అడ్డుకోవటం తన ఉద్దేశమంటూ ఈ బిల్లును లోక్‌సభలో ఆమోదింపజేశారు కూడా. కానీ దేశవ్యాప్తంగా.. పత్రికల్లోనూ, రాజకీయ పక్షాల్లోనూ దీనిపై తీవ్ర నిరసన జ్వాలలు రేగాయి. సొంత పార్టీలో కూడా దీన్ని వ్యతిరేకించే వర్గమే బలంగా ఉండటంతో చివరికి రాజీవ్‌గాంధీ దీన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ‘స్వేచ్ఛాయుతమైన పాత్రికేయ ప్రపంచం లేకుండా ప్రజాస్వామ్యం మనలేదంటూ’ స్వయంగా ప్రకటన కూడా చేయాల్సి వచ్చింది. #KhabarLive