ఊర్లో ఉన్నా, టౌన్లో ఉన్నా… రైల్లో ఉన్నా వైఫై ఉంటుంది. అవును… తాజా బడ్జెట్‌లో ఇది పెద్ద హైలెట్. ఇంటర్నెట్ సదుపాయ కల్పనకు-టెక్నాలజీకి ఈ బడ్జెట్ లో మంచి ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని రైల్వే జోన్లతో పాటు ప్రతి రైల్లో వైఫై సదుపాయం కల్పించనున్నారు. అంతేకాదు, ప్రతి రైల్లో సీసీ టీవీలు ఏర్పాటుచేసి నేరాలను, దొంగతనాలు, స్ర్తీలపై అఘాయిత్యాలను నివారించడానికి చర్యలు తీసుకోనున్నారు.
భారత్ నెట్ వర్క్ ప్రోగ్రాం ప్రవేశపెట్టి గ్రామాలను డిజిటలైజ్ చేయనున్నారు. దీనికోసం పది వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. టోల్ ప్లాజాలో ఇక ప్రతి చోటా ఆగకుండా ఎలక్ట్రానిక్ పే సిస్టమ్ మొదలుపెట్టనున్నారు.
దేశంలో చాలా చోట్ల ఎయిర్ పోర్టులు ఉన్నా ఇంతకాలం వాటిని ఉపయోగించింది లేదు. అందుకే ఉడాన్ పథకం కింద ఇక వాటన్నింటినీ అందుబాటులో తేనున్నారు. టిక్కెట్ల ధరలు కూడా అదుపులో ఉండటం వల్ల ఎయిర్ ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో కొత్తగా 56 విమానాశ్రాయలను అభివృద్ధి చేస్తారు.
ప్రభుత్వమే 900 విమానాలు దీనికోసం కొనుగోలు చేయనుంది. ఇప్పటికే ఏపీలో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, కడప, అనంతపురం ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉన్నాయి. మరో మూడు విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. #KhabarLive